Telangana New High Court Building : తెలంగాణ నూతన హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరుకానున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన తరువాత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధేతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు కొత్త భవనానికి భూమిని కేటాయించేందుకు రేవంత్‌రెడ్డి అంగీకరించారు. ఆ వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే న్యాయశాఖ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌లు భూమి కేటాయింపు కోరుతూ లేఖ రాశారు.
బెంగళూరు పరిస్థితి రాకముందే మేల్కొండి - నీటి సమస్యపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఇందులో భాగంగా కొత్త హైకోర్టు నిర్మాణంకోసం ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లోని వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన 100 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం డిసెంబరులో ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టును నూతన భవనంలోకి తరలించిన తరువాత పాత కోర్టు భవనాన్ని చారిత్రక కట్టడంగా పరిరక్షిస్తూ సివిల్ కోర్టు అవసరాలకు వినియోగించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
CJI Lays Foundation To TS High Court :పాతబస్తీలోని ప్రస్తుత భవనంలో 104 ఏళ్లుగా హైకోర్టు (Telangana High Court) కొనసాగుతోంది. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించిన ఈ భవనంలో 2009లో అగ్నిప్రమాదం జరిగింది. అప్పటి నుంచే కొత్త భవనం నిర్మాణం కోసం చర్చ, ప్రతిపాదనలు మొదలయ్యాయి. అప్పట్లో బుద్వేల్‌తోపాటు చంచల్‌గూడ సమీపంలోని ప్రింటింగ్ ప్రెస్, సోమాజిగూడ, హైటెక్‌సిటీ తదితర ప్రాంతాల్లో స్థలాల పరిశీలన జరిగింది. అయితే ప్రస్తుతం కేటాయించిన స్థలంలో ఆధునిక వసతులతో హైకోర్టు భవనంతోపాటు న్యాయమూర్తులకు నివాస సముదాయాన్ని కూడా నిర్మించనున్నారు. ఈరోజు జరగనున్న శంకుస్థాపన కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌తోపాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, న్యాయమూర్తులు, రిజిస్ట్రార్‌లు పాల్గొననున్నారు.
మరోవైపు వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల భూముల్లో హైకోర్టు నిర్మించడానికి జారీచేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని వ్యవసాయ వర్సిటీ విద్యార్థులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వర్సిటీ భూముల్లో కోర్టు నిర్మించడం ద్వారా అరుదైన వృక్షసంపద, బయోడైవర్సిటీ, పక్షులు, జంతువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
హైకోర్టు నూతన భవన నిర్మాణానికి మరో ముందడుగు - న్యాయశాఖ పేరుపై ఆ 100 ఎకరాల రిజిస్ట్రేషన్
జీవో 55 రద్దు చేయాల్సిందే - వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు