Telangana LRS Scheme 2024 : రాష్ట్రంలో లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్) ( LRS Scheme in Telangana)నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో ఇప్పుడు సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మార్చి 31 లోగా క్రమబద్ధీకరణను పూర్తి చేయాలని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి గడిచిన నెలలో అధికారులకు ఆదేశాలిచ్చారు. తక్కువ వ్యవధిలో పూర్తి చేయాలంటే గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను మార్చాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రక్రియను కుదిస్తూ ముసాయిదాను రూపొందించి తెలంగాణ సర్కార్‌కి పంపారు. వీటిపై ఉత్తర్వుల జారీలో జాప్యం జరిగింది.
LRS Applications Regularization 2024 : ఈలోగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. క్రమబద్ధీకరణ ప్రక్రియకు 2020 నుంచి అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకున్న మీదట నిర్వహించాలన్న సూచనలను సైతం అధికారులు పరిశీలించినప్పటికీ ముందడుగు వేసేందుకు తర్జనభర్జన పడుతున్నారు.
మూడేళ్లకు ఎల్‌ఆర్'ఎస్' - సర్కారు నిర్ణయంతో హెచ్ఎండీఏకు రూ.1000, జీహెచ్ఎంసీకి రూ.450 కోట్లు
ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోవాల్సినంత అత్యవసర వ్యవహారం కాదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సమయం కూడా కేవలం 11 రోజులు మాత్రమే ఉంది. దరఖాస్తుల పరిశీలనకు, సొమ్ము చెల్లించేందుకు నోటీసులు పంపిన తర్వాత కనీసం వారం నుంచి పది రోజుల గడువు ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా అంశాలను పరిశీలించిన మీదట ప్రస్తుతానికి ఈ ప్రక్రియ నిర్వహించటం సాధ్యం కాదని ఆ అధికారి వివరించారు. రాష్ట్రంలో జూన్ తొలివారం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాతే ఈ అంశం మళ్లీ తెరమీదకు వచ్చే అవకాశం ఉంది.