Teacher Throws Footwear on Students : ఓ ఉపాధ్యాయుడు విచక్షణ కోల్పోయి విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు ఆయనకు దేహశుద్ధి చేశారు. ఉన్నతాధికారులు ఉపాధ్యాయుడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే,
గణతంత్ర దినోత్సవ వేడుకల సన్నద్ధతలో భాగంగా తొమ్మిదో తరగతి విద్యార్థినులతో శుక్రవారం ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి దేశభక్తి పాటల సాధన చేయిస్తున్నారు. ఆటల పోటీల నుంచి అప్పుడే వస్తున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని గదిలోకి వస్తూ నవ్వింది. దీంతో విచక్షణ కోల్పోయిన సదరు ఉపాధ్యాయుడు కోపంతో విద్యార్థినిపైకి తన చెప్పు విసిరాడు. అప్రమత్తమైన ఆమె తప్పించుకోగా వరండాలో బాలిక పక్కనే వస్తున్న పదో తరగతి విద్యార్థిని మెడకు తగిలింది. ఆమె చెవి కమ్మ వంకర కావడంతో పాటు విద్యార్థిని మెడకు స్వల్ప గాయం అయింది. చెప్పు తగలకుండా తప్పించుకున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని వద్దకు వెళ్లిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి వీపు, చెంపలపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. సాయంత్రం ఇంటికి వెళ్లిన విద్యార్థిని శరీరంపై వాతలను గమనించిన తల్లిదండ్రులు శనివారం స్కూల్కు వచ్చారు. హెచ్‌ఎం, ఇన్‌ఛార్జి ఎంఈవో విష్ణుమూర్తిని నిలదీశారు.
సదరు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డిని ప్రశ్నించగా నిర్లక్ష్యంగా జవాబు ఇవ్వడంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆయనకు దేహశుద్ధి చేశారు. చెప్పు తగిలిన బాధితురాలు తల్లిదండ్రులు గతంలో చనిపోవడంతో బంధువుల వద్ద కొండనాగులలో ఉంటూ చదువుకుంటోంది. వారు కూడా వచ్చి హెచ్‌ఎంను ప్రశ్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డిని వెంటనే స్కూల్ నుంచి పంపించేశారు.
శ్రీనివాస్ రెడ్డి ప్రవర్తనపై తరచుగా ఫిర్యాదులుండటం, తరగతి గదిలో అసభ్య పదజాలంతో దుర్భాషలాడతాడని బాధిత విద్యార్థినులు రోదిస్తూ చెప్పడంతో హెచ్‌ఎం ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటన సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నర్సింహా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్ కుమార్‌తో ఫోన్లో మాట్లాడి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఎంఈవో విష్ణుమూర్తి నివేదిక ఆధారంగా సదరు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థినులతో ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన - చితకబాదిన స్థానికులు
మ్యాథ్స్ రావడం లేదని విద్యార్థికి గోడ కుర్చీ వేయించిన టీచర్ - తరువాత ఏమైందంటే!