Telangana HC Serious On Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపును తిరుగుతుంది. ఇప్పటికే నిందితులను విచారించిన అధికారులు వారి నుంచి కీలకమైన విషయాలను రాబట్టారు. అందులో భాగంగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామని ఫోన్ ట్యాపింగ్ నిందితులు విచారణలో తెలిపారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. విడిచిపెట్టడానికి ఇదిసాధారణ అంశం కాదని వ్యక్తిగత గోప్యతలోకి చొరబడడమేనని పేర్కొంది.
అంతే కాకుండా ఈ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని హైకోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులను జారీ చేసింది. నాలుగు వారాల్లోగా ఫోన్ల ట్యాపింగ్‌పై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. పోలీసుల విచారణలో ఎస్ఐబీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేస్తున్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా తీసుకుంది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ టి. వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
Phone Tapping Case in Telangana :విచారణలో భాగంగా కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నిఘా విభాగం అదనపు డీజీపీ తదితరులకు ఫోన్ల ట్యాపింగ్‌పై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందంటూ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ప్రవీణ్‌కుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ హైకోర్టు వ్యాఖ్యలను ఏకీభవిస్తూ ప్రభుత్వం ఈ ఫోన్ల ట్యాపింగ్ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తోందని అన్నారు.