Special Barrack for Patnam Narender Reddy in Jail : బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చర్లపల్లి జైలులో ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలన్న పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ మేరకు తోటి ఖైదీలతో కాకుండా నరేందర్‌రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని జైలు సూపరింటెండెంట్‌కు హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా నరేందర్‌రెడ్డికి ఇంటి భోజనం అనుమతించాలని స్పష్టం చేసింది. నాలుగు రోజుల క్రితం చర్లపల్లి జైలులో తనను ప్రత్యేక బ్యారక్‌లో ఉంచాలంటూ పట్నం నరేందర్‌రెడ్డి హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది కోర్టు రిజిస్ట్రీకి పిటిషన్‌ను సమర్పించారు.
నేరస్థులు ఉండే బ్యారక్‌లో పట్నం నరేందర్‌రెడ్డిని ఉంచారని పిటిషన్‌లో తెలిపారు. నరేందర్‌రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేయాలని ఆయన తరఫు న్యాయవాది హౌజ్ మోషన్ పిటిషన్‌లో కోరారు. తొలుత పిటిషన్‌ను హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలించి తిరస్కరించారు. తాజాగా నరేందర్‌రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని న్యాయస్థానం జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలిచ్చింది. మరోవైపు లగచర్ల ఘటన అంశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి చేరింది. ఘటనపై రాష్ట్రపతి కార్యాలయ అధికారులు సమాచారం కోరారు. బీఆర్ఎస్ నాయకులు వివరాలు అందజేసి రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరారు. లగచర్ల ఘటనపై ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవహక్కుల కమిషన్లకు బాధితులు ఫిర్యాదు చేశారు.
హైకోర్టులో నరేందర్‌రెడ్డి క్వాష్ పిటిషన్ : ఇదికాగా మరోవైపు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన న్యాయవాదుల ద్వారా కోర్టుకు అఫిడవిట్ పంపించారు. బీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తున్న తనను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోని వికారాబాద్ జిల్లా డీటీసీకి తీసుకెళ్లారని పట్నం నరేందర్‌రెడ్డి కోర్టుకు పంపించిన అఫిడవిట్‌లో తెలిపారు. ఆ సమయంలో పోలీసులు తన స్టేట్‌మెంట్ అసలు తీసుకోలేదని చెప్పారు.