Telangana High Court Judgement On Stolen Gold :చోరీకి గురైన బంగారు నగలను, ఇతర విలువైన వస్తువులను సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉందని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే సీఆర్‌పీసీ సెక్షన్ 91 కింద కాకుండా సెక్షన్ 102లో పేర్కొన్న విధంగా వాటిని సీజ్ చేయవచ్చని ధర్మాసనం తెలిపింది. దొంగతనం కేసుల్లోని బంగారు నగలను స్వాధీనం చేయాలంటూ తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ 2021 నుంచి దాదాపు 16 పిటిషన్లు దాఖలు చేసింది. వీటిపై ఇటీవల జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పలు వాదనలు విన్న అనంతరం తీర్పు వెలువరించారు.
న్యాయవాదుల వాదనలు : పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం వ్యక్తి గుర్తింపును ధ్రువీకరించుకుని రుణం మంజూరు చేస్తామని, పోలీసులు తరచూ వ్యాపారానికి ఆటంకం కలిగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజె వాదనలు వినిపిస్తూ, పిటిషన్ విచారణార్హం కాదని అన్నారు. ఒకవేళ ఈ కోర్టు ఏవైనా ఉత్తర్వులు జారీ చేసినట్లయితే దర్యాప్తునకు అడ్డంకిగా మారుతుందని తెలిపారు.