Phone Tapping Case Update :ఫోన్ టాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న అదనపు ఎస్పీ భుజంగ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయలతో కూడిన రెండు షూరిటీలు సమర్పించాలని, పాస్‌పోర్టులు ట్రయల్ కోర్టులో సమర్పించాలని దర్యాప్తునకు సహకరించాలని షరతులు విధించింది.
వాదనలు : సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో గతేడాది మార్చి 24న భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్‌రావులను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. తిరుపతన్న సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకొని ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. భుజంగరావు, రాధాకిషన్‌రావుల బెయిల్ పిటీషన్‌లపై జస్టిస్ కె.సుజన ఈ రోజు ఉత్తర్వులు వెలువరించారు. బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, కేసులో సూత్రధారులుగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా అధినేత శ్రవణ్ కుమార్ ఇప్పటికీ అమెరికాలోనే పరారీలో ఉన్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గత వాదనల సందర్భంగా కోర్టుకు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో కీలక నేతల ఆదేశాల మేరకు ఎస్‌ఐబీ అధికారిగా ఉన్న భుజంగరావు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు పోన్ టాపింగ్ చేశారన్నారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో పాటు పలువురు కాంగ్రెస్ నేతల ఫోన్లు టాపింగ్ చేశారన్నారు. న్యాయమూర్తుల ఫోన్లను సైతం టాపింగ్ చేశారని, ఆధారాలను మాయం చేశారన్నారు. బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని పీపీ వాదించారు. నిందితులిద్దరూ ఇప్పటికే గత 10 నెలలుగా జైల్లో ఉన్నారని, దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు అభియోగపత్రాన్ని కూడా కోర్టులో దాఖలు చేశారని పిటీషనర్ల తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్ రావు కోర్టుకు తెలిపారు.