Telangana High Court On Building a Compound Wall : కాంపౌండ్ వాల్ నిర్మించడానికి స్థానిక సంస్థల నుంచి తప్పనిసరిగా అనుమతి ఉండాలని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ నిర్మాణం తాత్కాలికమైనా, శాశ్వతమైనా సంబంధిత మున్సిపాలిటీ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల అధికారాల్లో జోక్యం చేసుకుని అనుమతి చేయలేమని తెలిపింది. హైడ్రా కూల్చివేసిన ప్రహరీని నిర్మించుకోవడానికి అనుమతించాలంటూ ఏపీలోని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి భార్య కె. ఉమామహేశ్వరమ్మ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
హైదరాబాద్ శివారు అమీన్‌పూర్‌లో ఉన్న తన 9ఎకరాల స్థలానికి చెందిన ఫామ్‌హౌస్ ప్రహారీ గోడను, అందులో ఉన్న షెడ్లను హైడ్రా కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ఉమామహేశ్వరమ్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ తాజాగా మరోసారి విచారణ చేపట్టగా, పిటిషినర్ తరఫు సీనియర్ న్యాయవాది వేదులు శ్రీనివాస్ వాదనలు వినిపించారు. హైడ్రా కాంపౌండ్ వాల్‌ను కూల్చివేయడంతో స్థలానికి భద్రత లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ అమీన్‌పూర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని వివరించారు. దీనికి హైకోర్టు తీర్పునిస్తూ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి స్థానిక సంస్థల నుంచి అనుమతి తప్పనిసరి అని తేల్చి చెప్పింది. ఆమె వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
దుర్గం చెరువు ఒక్కటే కాదు - హైదరాబాద్ వాసులకు ఇకపై '100' ఆప్షన్స్!