TG Govt Release TG bPASS in Telangana: ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, లేఅవుట్లకు వేగంగా అనుమతిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే టీఎస్ బీపాస్‌ను తీసుకొచ్చిన సర్కారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునికు హంగులు అద్దుతోంది. కృత్రిమ మేథాను ఉపయోగించి అనుమతిచ్చేలా చర్యలు చేపట్టింది. రేపటి నుంచి ప్రజావిజయోత్సవాల్లో భాగంగా ఆ టీజీ బీపాస్ యాప్‌ను ప్రభుత్వం విడుదల చేయనుంది.
టీజీ బీపాస్‌కు కృత్రిమ మేధతో కొత్త హంగులు : రాష్ట్రంలో ఇళ్లు, వాణిజ్య సముదాయాలు, లేఅవుట్ల అనుమతుల ప్రక్రియను సరళీకరించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీజీ బీపాస్‌కు కృత్రిమ మేధతో కొత్త హంగులు అద్దుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంసాయంతో అత్యంత పారదర్శకంగా, మెరుపువేగంతో అనుమతులు మంజూరయ్యేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతానికి ‘టీజీ బీపాస్ 2.0’గా పిలుస్తున్న ఆ కొత్త అప్లికేషన్‌ను డిసెంబరు 1 నుంచి చేపట్టబోతున్న ప్రజాపాలన విజయోత్సవాల్లో ప్రభుత్వం ప్రకటించనుంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ సహా రాష్ట్రవ్యాప్తంగా నగర, పురపాలక సంస్థలన్నింటిలో ఆ అప్లికేషన్ అందుబాటులోకి తేనున్నారు.
టీజీ బీపాస్ ద్వారా ఇంటి నుంచే దరఖాస్తులు : ఇళ్ల నిర్మాణాలకు అనుమతుల ప్రక్రియను సరళతరానికి గత ప్రభుత్వం టీఎస్‌బీపాస్ పేరిట పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. నగర, పురపాలక సంస్థల పరిధిలో ఇళ్లు,అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు, లేఅవుట్లు వంటి వాటి నిర్మాణ అనుమతులకు కార్యాలయానికి వెళ్లకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులో పేర్కొన్న వివరాలు నిబంధనలకి లోబడి ఉన్నాయా, లేవా అన్నది కంప్యూటరే విశ్లేషిస్తుంది. అంతా సవ్యంగా ఉంటే అనుమతిచ్చేస్తుంది. లేకపోతే డ్రాయింగ్స్‌ను సరిదిద్ది మళ్లీ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
ఇదంతా కంప్యూటరీకరణే అయినా పాతపరిజ్ఞానం కావడం ఇళ్లు, బహుళ అంతస్తుల భవనాలు, లేఅవుట్ల వంటివాటిని వేటికవే వేర్వేరుగా విశ్లేషించాల్సి రావడం వల్ల చాలా సమయం పడుతోంది. బహుళ అంతస్తుల భవనాల వంటి వాటి అనుమతులకు రెండు నుంచి 30 రోజుల సమయం తీసుకుంటోంది. దరఖాస్తు చేసే విధానం గందరగోళంగా ఉండేది. దాన్నిచక్కదిద్ది సవ్యంగా ఉంటే అనుమతి ఇవ్వడం నిబంధనల మేరకు లేకుంటే తిరస్కరించడం వేగంగా జరిగిపోవాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు టీజీబీపాస్‌కు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జోడించారు. ప్రస్తుతానికి దీన్ని ‘టీజీబీపాస్ 2.0’గా పిలుస్తున్నా త్వరలోనే కొత్త పేరు పెట్టబోతున్నారు.