Huge Money Spend on Marriage Events : పెళ్లికి ఉన్నంత ప్రాధాన్యం, ప్రత్యేకత మరే సందర్భానికీ ఉండదు. తమ వారి పెళ్లి గొప్పగా జరగాలని ఖర్చుకు వెనకాడకుండా అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. మనసెరిగిన వ్యక్తితో కలసి నడవాలని అమ్మాయిలకు, తమ ఇళ్లను చక్కదిద్దగలరనే విశ్వాసంతో అబ్బాయిలు భాగస్వామి ఎంపికలో అన్నీ ఆలోచిస్తున్నారు. తాము ఇష్టపడ్డ వారి గురించి కన్నవారి మనసును కష్టపెట్టకుండా ఒప్పించుకుంటున్నారు. దీంతో కులమతాలకు అతీతంగా ఎన్నోజంటలు ఒక్కటవుతున్నాయి. ఇది ఇక్కడితో ఆగకుండా తమకు నచ్చినట్లు పెళ్లి నిర్వహించాలని వధూవరులు కోరుకుంటున్నారు. తల్లిదండ్రులు మాత్రం ఖర్చుకు వెనకాడి మొదట్లో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా చివరికి పిల్లల ఇష్టాన్ని కాదనలేక వైభవంగా పెళ్లి జరిపిస్తున్నారు. అయితే ఈ పెళ్లి ఖర్చులపై వెడ్‌మిగుడ్ అనే సంస్థ సర్వేను నిర్వహించి, గతేడాది కంటే ఇప్పుడు భారీగా పెళ్లి ఖర్చులు పెరిగాయని వెల్లడించింది.
3,500 జంటలతో సర్వే : 2024లో వివాహ వేడుకలకు సంబంధించి వెడ్‌మిగుడ్ సంస్థ 3,500 నూతన జంటలతో సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అంతకుముందు రెండు సంవత్సరాలకు సంబంధించి వెడ్డింగ్‌వైర్ ఇండియా వెల్లడించిన వ్యయాల ప్రకారం 2022లో సగటు పెళ్లి ఖర్చు రూ.25 లక్షలు, 2023లో రూ.28 లక్షలతో పోలిస్తే 2024లో భారీగా పెరిగాయి. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చిలో పెళ్లి చేసుకున్నవారు, చేసుకోబోతున్న వారి వివరాలు తెలిపారు.
అన్నీ వారికి నచ్చినట్లే : వివాహాలకు ఇంతగా ఖర్చు చేయడానికి కారణాలు విశ్లేషిస్తే పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. చిన్న వయసులోనే పెద్ద మొత్తంలో సంపాదిస్తుండటం, భవిష్యత్తులో మరింతగా సంపాదించగలమనే ధైర్యంతో తమ పెళ్లి కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. తల్లిదండ్రుల వద్ద సరిపోయే డబ్బులు లేకపోతే వారే ఆ సొమ్మును పెడుతున్నారు. సిటీలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా వారే కన్వెన్షన్ కేంద్రాల బుకింగ్ దగ్గరి నుంచి పెళ్లి మండపం అలంకరణ వరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వివాహాలకు సంపన్నులు, ఎగువ మధ్యతరగతి వర్గాలు డెస్టినేషన్ వెడ్డింగ్స్ పేరుతో విదేశాలు, ఇతర నగరాలకు వెళ్తుంటే మధ్యతరగతి వర్గాలు కన్వెన్షన్ సెంటర్లు, రిస్టార్టుల్లో వేడుకలను నిర్వహిస్తున్నాయి.
ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి ఎంగేజ్‌మెంట్ వరకు తగ్గేదేలే అంటూ డబ్బులు ఖర్చు చేస్తున్నారు. బ్యాచిలర్ పార్టీలు, మెహిందీ, సంగీత్, పెళ్లి విందు, ఫొటోగ్రఫీ, పెళ్లి మండపం, అలంకరణల కోసమే వధూవరులిద్దరూ చెరో రూ.25 లక్షలు ఖర్చు చేస్తున్నారు. వేడుకల్లో విందుకు ఒక్కో ప్లేటుకు దాదాపు రూ.2వేల వరకు చేస్తున్నారు. వందకు పైగా రుచులను వడ్డిస్తున్నారు. పెళ్లికి బంధుమిత్రులకు పత్రికలు పంచడం, వచ్చిన వారిని పలకరించడం వంటి పెద్దరిక బాధ్యతలను కూడా చూసుకుంటున్నారు. ఇది వరకు కట్నకానుకలకు ఎక్కువ వ్యయం చేసేవారు. ఇప్పుడు సమాజంలో మారుతున్న మార్పులతో అమ్మాయి, అబ్బాయికి తమ ఆస్తిని చెరిసగం పంచి ఇస్తున్నారు. దీంతో వాటి గురించి కంటే వివాహ వేడుకలను ఎలా నిర్వహించాలనే చర్చే ఎక్కువగా వస్తోంది.
'నేను ఎన్నికల్లో గెలిస్తే బ్రహ్మచారులకు పెళ్లిళ్లు జరిపిస్తా!'
పెళ్లి కోసం అప్పు - లాభమా? నష్టమా? ఆర్థిక నిపుణుల మాటేంటి? - Wedding With Personal Loan