Summer Care in Oil Palm Gardens :రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఆ ప్రభావం ఉద్యాన పంటలపై తీవ్రంగా చూపుతుండటంతో పాటు ప్రత్యేకించి ఆయిల్‌పాం పంట కూడా దెబ్బతింటోంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం గత సంవత్సరం తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భూగర్భ జలాలు ఎండిపోయాయి. మండిపోతున్న ఎండలు, అధిక ఉష్ణోగ్రతలు తీవ్రతను దృష్టిలో వుంచుకుని ఉద్యాన సంచాలకులు అశోక్‌రెడ్డి హనుమకొండ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కరీంనగర్, వరంగల్ జిల్లాల అధికారులు, ఆయిల్‌పాం క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షించారు.
Summer Protect Palm Oil Cultivation : ఈ ఏడాది వేసవి ఎండల తీవ్రత, అడుగంటిపోతున్న భూగర్భ జలాలు తీవ్రత కారణంగా ఆయిల్‌పాం పంటలు మరింత దెబ్బతినకుండా కాపాడుకునేందుకు శాస్త్రీయపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యాన సంచాలకులు అశోక్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ తట్టుకునే సామర్థ్యం ఆయిల్‌పాం పంటకు ఉంటుందని చెప్పారు. నీరు తక్కువై మొక్కలు చనిపోయే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. ఆయిల్‌పాం మొక్కలపై వేసవి కాలంలో నీటి ప్రభావం చూపకుండా తగిన చర్యలు తీసుకోవాలని అశోక్‌రెడ్డి తెలిపారు.
వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ఆయిల్‌పాం మొక్కల పాదుల్లో మొదలుకు కొంచెం దూరంలో జనుము విత్తనాలు చల్లుకోవాలని సూచించారు. ఇది వేసవి కాలంలో ఆయిల్‌పాం మొక్కలను వేడి గాలుల నుంచి రక్షిస్తుందన్నారు. నీటి ఎద్దడి ఉన్న పామాయిల్ తోటల్లో అంతర సేద్యం చేయకూడదని పేర్కొన్నారు. మూడేళ్లలోపు వయస్సు ఉన్న ఆయిల్‌పాం మొక్కల్లోని పూగుత్తులను లేత దశలోనే ప్రతి నెల ఆబ్లేషన్ సాధనం సాయంతో తొలగించాలని చెప్పారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఒకేసారి నీరు ఇవ్వకుండా విడతల వారీ ఇస్తూ పాదుల్లో తేమ ఉండేటట్లు చూసుకోవాలని అశోక్‌రెడ్డి వివరించారు.
ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు సర్కార్ ప్రత్యేక దృష్టి
వేసవిలో మొదటి సంవత్సరం మొక్కలకు మైక్రో జెట్‌లకు బదులుగా డ్రిప్పర్లు బిగించి నీరు పెట్టుకోవడం మంచిది. బాగా ఎదిగిన ఆయిల్‌పాం తోటల్లో గెలలు కోసిన తర్వాత నరికి ముక్కలు చేసిన ఆయిల్‌పాం ఆకులు, మగ పూల గుత్తులు, మొక్కజొన్న చొప్ప, ఖాళీ ఆయిల్‌పాం గెలలు పాదుల్లో మల్చింగ్‌గా పరచాలి. ఆయిల్‌పాం మొక్కల ఆకులు నరకడం చేయకూడదు. - అశోక్ రెడ్డి, ఉద్యాన సంచాలకులు
'మనం ఇంట్లో వాడే వంట నూనెల్లో ప్రధానమైంది పామాయిల్. ఈ నూనె ఆయిల్‌పాం అనే చెట్టు నుంచి వచ్చే గెలల నుంచి తీస్తారు. ఆయిల్‌పాం చెట్టు జీవిత కాలం 30 నుంచి 50 ఏళ్లు ఉండటం వల్ల రైతులకు మంచి ఆదాయం అందిస్తోంది. వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్రం 1992 నుంచి వివిధ కార్యక్రమాల ద్వారా ఆయిల్‌పాం అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్‌పాం సాగు కేంద్ర ప్రాయోజిక కార్యక్రమం నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్‌ఫాం, ఎన్‌ఎంఈఓ, ఓపీ ద్వారా అమలవుతోంది. తద్వారా 1992-93 నుంచి 2023-24 వరకు 2 లక్షల 3 వేల ఎకరాల విస్తీర్ణం ఆయిల్‌పాం పంట సాగు కిందకు తీసుకొచ్చినట్లైంది.' అని అశోక్ రెడ్డి అన్నారు.
TS Govt Subsidy over Palm oil Farming : రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృష్ట్యా ప్రభుత్వం ఆయిల్‌పాం పంట సాగు కోసం రాయితీలు ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. 31 జిల్లాల్లో ఆయిల్‌పాం పంట సాగు విస్తరణ చేపట్టేందుకు 12 కంపెనీలకు అనుమతులు ఇచ్చింది. మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్ మినహా ఆయిల్‌పాం మొక్కలు పెంచడం కోసం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 42 నర్సరీలు ఏర్పాటు చేసింది. 2024-25 సంవత్సరం సంబంధించి 1 లక్ష ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పాం సాగు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించిన దృష్ట్యా. అందుకు అవసరమైన మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉంచినట్లు ఉద్యాన శాఖ అధికారులు వెల్లడించారు.
ఆయిల్ పామ్ అదుర్స్.. విపత్తులను సైతం తట్టుకుని..
సిరులు కురిపిస్తున్న పంట.. నారు కోసం లోకమంతా వేట..