Bhatti Vikramarka Introducing Telangana Budget 2024 :ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులున్నా ప్రజల ఆకాంక్షలు, హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి పద్దును శాసనసభలో ప్రవేశపెట్టింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పోలిస్తే కాస్త ఎక్కువగా 2 లక్షల 91వేల 159 కోట్ల రూపాయలతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పద్దును ప్రవేశపెట్టారు. గత పదేళ్ల అస్తవ్యస్త పాలనకు విజ్ఞతతో చరమగీతం పాడిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆర్థిక మంత్రి, దశాబ్ద కాలంలో ఆశించిన మేర అభివృద్ధి జరగలేదని ఆరోపించారు.
బంగారు తెలంగాణగా మారుస్తామని ఒట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా వైఫల్యం చెందారని భట్టి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అటుంచితే రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల అప్పులు కట్టడానికి అప్పులు తీసుకునే పరిస్థితికి రాష్ట్రం దిగజారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం తాము ఎదుర్కొన్న పెను సవాలన్న భట్టి, గత ప్రభుత్వం చేసిన అప్పులైనా ప్రభుత్వపరంగా బాధ్యతతో వాటిని తీర్చేందుకు అన్ని చర్యలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షల ప్రతిబింబమే బడ్జెట్ :బడ్జెట్ అనేది కేవలం అంకెల సమాహారం కాదని, మన విలువల, ఆశల వ్యక్తీకరణ కూడా అని పేర్కొన్న భట్టి, ప్రజల ఆకాంక్షలు, నమ్మకాల ప్రతిబింబమే బడ్జెట్ అని పేర్కొన్నారు. అసమానతలు లేని సమాజం, అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్‌లో చర్యలు చేపట్టామన్న భట్టి, సాగును బాగు చేసేలా, సంక్షేమం పరిఢవిల్లేలా, కొత్త ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తరువాత వాస్తవానికి దగ్గరగా, ప్రణాళికాబద్దమైన బడ్జెట్‌తో ముందుకు సాగుతున్నామన్నారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, హామీల అమలే లక్ష్యంగా రూ. 2 లక్షల 91వేల 159 కోట్లతో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి భట్టి శాసనసభకు సమర్పించారు. ఇందులో రెవెన్యూ రాబడి రూ. 2 లక్షల 21వేల 242 కోట్లు, మూలధన రాబడి రూ.69వేల 572 ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా రూ. లక్షా 38వేల 181 కోట్లు, పన్నేతర ఆదాయం రూ. 35వేల 208 కోట్లు వస్తుందని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ. 26వేల 216 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా 21వేల 636 కోట్ల రూపాయలు వస్తాయని ప్రతిపాదించారు. బహిరంగ మార్కెట్‌లో రుణాల ద్వారా రూ. 57వేల 112 కోట్లు, కేంద్రం నుంచి రుణాల ద్వారా రూ. 3 వేల 900కోట్లు, ఇతర రుణాల ద్వారా వెయ్యి కోట్లు సమకూర్చుకుంటామని స్పష్టం చేశారు.