Fancy Numbers For New Vehicles : వాహనాల ఫ్యాన్సీ నంబర్లు రవాణా శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత ధర అయినా సరే కొనాల్సిందే అంటున్నారు. ఆన్ లైన్ లో ఫ్యాన్సీ నంబర్లు లక్షల రూపాయలు పలుకుతున్నాయి. సెలబ్రిటీలు, రాజకీయనేతలు మాత్రమే కాదు సాధారణ ప్రజలు సైతం ఫ్యాన్సీ నంబర్ల కోసం తాపత్రయపడుతున్నారు. దీంతో డిమాండ్ భారీగా పెరిగిపోతుంది. ఇంతకీ ఫ్యాన్సీ నంబర్లతో రవాణాశాఖకు ఆదాయం ఏమేరకు సమకూరుతుంది. ఏనంబర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. తదితర అంశాలపై ప్రత్యేక కథనం.
ఫ్యాన్సీ నంబర్లపై రోజురోజుకు క్రేజీ పెరిగిపోతుంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, అదృష్ట సంఖ్య ఇలా తమ జీవితంలో ముఖ్యమైన నంబర్లను (ఫ్యాన్సీ) వాహనదారులు లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. కొందరు ప్రత్యేకమైన నంబర్ ను హోదాగా భావించడం, మరికొందరు న్యూమరాలజీని నమ్మి ఆ నంబర్ తో తమకు అంతా కలసివస్తుందనుకునేవారు ఇలా ఇలా ఏది ఏమైనా తమ వాహనానికి మాత్రం ఫ్యాన్సీ నంబర్ నంబర్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని అనుకుంటున్నారు. దీంతో పోటీ భారీగా పెరిగిపోతుంది. అదికాస్త నంబర్ కొనుగోలుపై ప్రభావం చూపిస్తుంది. ప్రస్తుతం ఫ్యాన్సీ నంబర్ల ట్రెండ్ కొనసాగుతుంది. దీంతో ఫ్యాన్సీ నంబర్ల క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది.
ఒక్కో నంబర్ లక్షల రూపాయలు పలుకుతుంది. ధర ఎంతైనా చెల్లించి ఫ్యాన్సీ నంబర్ ను వాహనదారులు సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా 1,6,9,99,999,9999 నంబర్లకు భారీగా డిమాండ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కువ మంది వాహనదారులు తమ వాహన నంబర్ ప్రారంభం నుంచి చివరి వరకు క్రమేపీ పెరుగుతూ పోవాలని కూడా కోరుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. తద్వారా సాధారణ నంబర్లకు కూడా డిమాండ్ పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఒక్కరోజే రూ.26 లక్షలు : తెలంగాణ రాష్ట్రంలో మొత్తం లక్షా 69వేల పైచిలుకు వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్లు రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి కాసుల పంట పండుతుంది. ఫ్యాన్సీ నంబర్లతో ఖైరతాఆద్ రవాణాశాఖ కార్యాలయానికి ఈ నెల(నవంబర్) 26వ తేదీ ఒక్కరోజే రూ.52 లక్షల ఆదాయం సమకూరింది. అత్యధికంగా TG 09 D 0001 నంబర్‌కు రూ. 11లక్షల పైగా ఆదాయం వచ్చింది. ఈ నంబర్‌ను రుద్రరాజు రాజీవ్ కుమార్ ఆన్లైన్ బిడ్డింగ్‌లో దక్కించుకున్నారు. TG 09 D 0009 నంబర్ కు రూ.10లక్షల 40వేల ఆదాయం లభించింది.
ఈ నంబర్ ను మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ కైవసం చేసుకుంది. TG 09 C 9999 నంబర్ కు రూ. 7లక్షల ఆదాయం సమకూరింది. ఈ నంబర్ ను శ్రీయాన్ కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. TG 09 D 0006 నంబర్ కు రూ. 3లక్షల 65 వేల ఆదాయం సమకూరింది. ఈ నంబర్ ను పోరుస్ ఆగ్రో పుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం కైవసం చేసుకుంది. TG 09 D 0005 నంబర్ కు రూ. 3లక్షల 45వేల ఆదాయం వచ్చింది. వెగా శ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఎల్ఎల్పీ యాజమాన్యం ఈ నంబర్ ను దక్కించుకుంది. TG 09 D 0007 నంబర్ కు రూ. 2లక్షల 6 వేల ఆదాయం సమకూరింది.
కోట్ల ఆదాయం : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఫ్యాన్సీ నంబర్ల రూపంలో రవాణాశాఖకు కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.421 కోట్ల ఆదాయం, గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి జిల్లాల నుంచి రూ.194 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో కేవలం ఫీజు రూపంలో రూ.389 కోట్ల ఆదాయం, బిడ్ ధర చెల్లింపులతో రూ. 226 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
2014లో రూ.23 కోట్లు, 2015లో రూ. 26 కోట్లు, 2016లో రూ. 35 కోట్లు, 2017లో రూ. 47 కోట్లు, 2018లో రూ. 55 కోట్లు, 2019లో రూ. 60 కోట్లు, 2020లో రూ. 44 కోట్లు, 2021లో రూ. 79 కోట్లు, 2022లో రూ. 110 కోట్లు, 2023 మార్చ్ నుంచి నవంబర్ నెలాఖరు వరకు రూ. 75 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. గత ఏడాదిలో మార్చ్ నెల నుంచి నవంబర్ నెలాఖరు వరకు 6,68,380 వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లను బిడ్డింగ్ లో తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ నెలాఖరు వరకు రూ.86 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది మార్చ్ నెల నుంచి నవంబర్ నెల వరకు 7 లక్షల 25 వేల వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లను తీసుకున్నట్లు రవాణాశాఖ అధికారులు పేర్కొన్నారు.
ఫ్యాన్సీ నంబర్ల మోజు : ఖైరతాబాద్ ఆర్టీఏకు కాసుల పంట - ఒక్కరోజులో రూ.52 లక్షలు బిడ్