TS Govt Income Sources for Crop Loan Waiver Scheme 2024 : తెలంగాణలో రైతుల రుణమాఫీకి నిధుల సేకరణకు ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీకి రూ.33,000 కోట్ల నుంచి రూ.35,000 కోట్ల వరకు అవసరమని రాష్ట్ర సర్కార్ అంచనా వేసినట్లు తెలిసింది. ఈ హామీని కచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనని, నిధుల సేకరణకు ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో, ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేపట్టారు.
2 Lakh Rythu Runa Mafi in Telangana 2024 : శాసనసభ ఎన్నికల సమయంలో విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హస్తం పార్టీ ప్రకటించింది. ఆగస్టు 15లోగా ఈ హామీని నెరవేర్చి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావించారు. విపక్షాలు సైతం ఈ అంశాన్ని ప్రముఖంగా లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రజంటేషన్ ఇచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర రెవెన్యూ, ఖర్చు, రుణాలకు ప్రతి నెలా చెల్లించాల్సిన అసలు, వడ్డీ, ఇలా అన్ని అంశాలను వివరించడంతోపాటు రుణమాఫీకి ఎంత మొత్తం అవసరమో కూడా స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. గతంలో రుణాల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా రుణం తీసుకొని, తర్వాత కిస్తీల రూపంలో ప్రతి నెలా చెల్లిస్తున్న విషయం తెలిసిందే.
రుణమాఫీకి ప్రత్యేక కార్పొరేషన్ : రుణమాఫీకి కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పీవీ) ద్వారా అమలు చేసే విధానంపై ఈ భేటీలో చర్చించినట్లు తెలిసింది. బ్యాంకులు రుణాన్ని మాఫీ చేస్తే, ఆ మొత్తాన్ని ప్రతి నెలా కొంత మొత్తంలో తెలంగాణ సర్కార్, బ్యాంకులకు చెల్లించే విధానాన్ని అమలు చేయాలనేది ప్రతిపాదన. పెరిగిన ఆదాయాన్ని, అదనంగా సేకరించే నిధులను దీనికి ఖర్చు చేస్తే సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది.