TG GOVT on Budget Proposals 2024-25: లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పూర్తి స్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. నాలుగు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్‌కు అనుమతి తీసుకున్నందున జులై నెలాఖరులోపు పూర్తి స్థాయి బడ్జెట్‌కు ఉభయసభలు ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. మరో 45 రోజులు మాత్రమే గడువు ఉన్న తరుణంలో పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పన చేసేలా కసరత్తును ఆర్థికశాఖ ప్రారంభించింది.
ఆదాయ ఆర్జిత శాఖల మంత్రులు, అధికారులతో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఇప్పటికే సమావేశమై లక్ష్యాలు, పురోగతి, సమస్యలను సమీక్షించారు. అటు పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో భాగంగా ఆర్థికశాఖ అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలను కోరింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి సంబంధించి ఆయా శాఖల పనితీరు సూచికల ఆధారంగా నిర్ధేశించిన లక్ష్యాల పూర్తి వివరాలను ఇవ్వాలని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.
TG Budget 2024 Estimation: 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆయా శాఖల పరిధిలోని పథకాల వ్యయ ప్రతిపాదనలను క్షుణ్నంగా సమీక్షించాలని ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఆయా పథకాల కొనసాగింపు అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆర్థికశాఖ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు బడ్జెట్ ప్రతిపాదనల్లో తగిన కేటాయింపులు చేయాలని తెలిపింది. ఇటీవల ప్రభుత్వ పరంగా చేసిన ముఖ్యమైన ప్రకటనలపై దృష్టి సారించాలని వాటికి తగిన నిధులను, అనుమతులు తీసుకొని ప్రతిపాదించాలని సూచించింది. బడ్జెట్ అంచనాలకు తగిన హేతుబద్ధత ఉండాలని తెలిపింది.