New Liquor Brands In Telangana :కొత్త లిక్కర్ బ్రాండ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలికింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్స్‌ను ఆహ్వానించడానికి తగు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశించిన రీతిలో కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో లేని విదేశీ దేశీయ లిక్కర్ బీర్ కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరుపుకోవడానికి కొత్త కంపెనీల నుంచి టీజీబీసీఎల్ దరఖాస్తులను స్వీకరించనుంది.
రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్లకు ఆహ్వానం :టీజీబీసీఎల్‌లో రిజిస్టర్ కాని కొత్త కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో జరుపుతున్న తమ మద్యం అమ్మకాలపై నాణ్యతా ప్రమాణాలతో అమ్మకాలు జరుపుతున్నట్లుగా మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆరోపణలు లేవని నిర్ధారణ సర్టిఫికేషన్ పత్రం దరఖాస్తుతో పాటు జతపరచాలని టీజీబీసీఎల్ కోరింది. తెలంగాణలో పలు కొత్త కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఇటీవల టీజీబీసీఎల్ కొందరికి అనుమతులు ఇచ్చింది. కానీ కొత్త కంపెనీలపై పలు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన కొత్త బ్రాండ్లను నిలిపివేసింది.