Telangana Exhibitors Association Welcome Telangana Govt Decision :సినిమా టికెట్ ధరలు, బెనిఫిట్ షోల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అభిప్రాయపడింది. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం వల్ల రాష్ట్రంలో థియేటర్లు మరో ఐదేళ్లు ఊపిరిపోసుకుంటాయని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డితో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా టికెట్ ధరల తగ్గింపుతో పాటు బెనిఫిట్ షోల రద్దుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కోరనున్నట్లు ఏపీ ఎగ్జిబిటర్లు తెలిపారు.
పుష్ప-2 చిత్రంతో జరిగిన ప్రాణనష్టం, తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాలకు చెందిన ఎగ్జిబిటర్లు సమావేశయ్యారు. టికెట్ ధరల పెంపు, అదనపు షోలు, బెనిఫిట్ షోలు, థియేటర్ల వద్ద భద్రత, సంధ్య థియేటర్ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంపై సుదీర్ఘంగా చర్చించారు. టికెట్ ధరలు పెంచడం వల్ల సింగిల్ స్క్రీన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, పెరిగిన ధరలకు అనుగుణంగా తమ థియేటర్లలో ప్రేక్షకుడికి కావల్సిన వసతులు సమకూర్చలేకపోతున్నామని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఆలోచన చేయాలి : ఇకపై బడ్జెట్లు, అగ్రహీరోలు, పెద్దాచిన్నా సినిమాలు అనే తేడా లేకుండా నిర్దిష్టమైన టికెట్ ధరలు ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వాలు ఇచ్చే జీవోల వల్ల ప్రేక్షకుల్లో టికెట్ ధరలపై గందరగోళం నెలకొంటుందని, ఇందుకు ఉదాహరణే ఇటీవల విడుదలైన పుష్ప-2 చిత్రమని పేర్కొన్నారు. తక్కువ ధరలు పెట్టి ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు వచ్చేలా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆలోచన చేయాలని విజయేందర్ రెడ్డి కోరారు. అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్‌లో థియేటర్ల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందన్నారు. సామాన్యులకు సినిమా అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు.
"సీఎం రేవంత్ రెడ్డి మున్ముందు టికెట్ల ధర పెంచేది లేదని, బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వమన్నారు. దాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్స్ స్వాగతిస్తుంది. సినిమాను బట్టి రేట్లను పెంచడం వల్ల ప్రేక్షకులు ఇబ్బందులు పడుతున్నారు. పేద, మధ్య తరగతి వాళ్లు చూడలేకపోతున్నారు. టికెట్ రేటు ఫిక్స్‌గా ఉండాలి అని చెప్పి దిల్‌రాజుని కోరాము."- విజయేందర్ రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్
'ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటానికి మేం ఒప్పుకోం - మేం అధికారంలో ఉన్నంతకాలం అలాంటి ఆటలు సాగవు'