Patancheru Couple Dies In Road Accident :పుణ్య క్షేత్రాల సందర్శనకు వెళ్లిన ఓ ఫ్యామిలీలోని దంపతులను రోడ్డు ప్రమాదం బలి తీసుకుంది. రేణిగుంట - కడప మార్గంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టిన ప్రమాదంలో దంపతులు మృతి చెందగా, వారి కుమార్తె పరిస్థితి విషమంగా మారింది. మరో కుమార్తె, కుమారుడు, మరో వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా సమాచారం. ఇదే కుటుంబంలో గతంలో ఇంటి చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు పెద్దకుమారుడు, కోడలు మృత్యువాతపడ్డారు. ఉన్న ఇద్దరు కుమారులు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతంగా ఉంది.
ఇంతకీ ఏం జరిగిందంటే? :వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సీతారామపురం కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న సందీప్‌షా(35), భార్య అంజలీదేవి(31) దంపతులకు 12 ఏళ్లలోపు ముగ్గురు పిల్లలు లిఖితా షా, సోనాలి షా, రుద్రప్రతాప్ షా ఉన్నారు. సందీప్ షా ట్రేడింగ్ వ్యాపారాన్ని చేస్తున్నారు. తన స్నేహితుడు నరేష్‌ను తీసుకొని జనవరి 16వ తేదీన సందీప్‌షా కుటుంబంతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్లారు. అనంతరం మరికొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని సోమవారం కారులో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుంది.