New Ration Cards Soon in Telangana :అర్హులందరికీ త్వరలోనే రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 1వ తేదీన కేబినెట్ భేటీలో విధివిధానాలు ఖారారు చేస్తామని స్పష్టం చేశారు. త్వరలో రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇవ్వనున్నట్లు వివరించారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారందరికీ రూ.500 సిలిండర్ ఇస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రేషన్ కార్డుపై అడిగిన ప్రశ్నకు పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పారు. ఇవాళ పౌరసరఫరాలశాఖ పద్దులపై వాడివేడి చర్చలు జరుగుతున్నాయి.
కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు :కేసీఆర్ చర్యలతో రాష్ట్రంలో ధాన్యం గణనీయంగా పెరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. పౌరసరఫరాల శాఖ ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయలేదని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలవలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సన్నబియ్యం టెండర్లు రద్దు చేశారా? లేదా అని ప్రశ్నలు వేశారు. కొత్త రేషన్ కార్డులు అన్నారు, ఎప్పుడు ఇస్తారని అడిగారు. కరీంనగర్ పర్యాటక ప్రాజెక్టుకు నిధులు ఇచ్చి పూర్తి చేయాలని కోరారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోస్తే సాగు, తాగునీటి ఇబ్బందులు రావని మాజీ మంత్రి గంగుల కమలాకర్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. శాసనసభలో సోమవారం నుంచి గరంగరం చర్చలు జరుగుతున్నాయి.