Kathipudi Ongole National High Way Expantion With 4 And 6 Rows In AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా ప్రాంతాలను కలుపుతూ వెళ్లే కీలకమైన కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారికి విస్తరణ భాగ్యం దక్కింది. దీనిని 4, 6 వరుసలుగా విస్తరించేందుకు డీపీఆర్ తయారు చేయాలని కేంద్రం ఆదేశించగా, ఆ మేరకు సలహా సంస్థ ఎంపికకు అధికారులు టెండర్లలను ఆహ్వానించారు. దీంతో 390 కిలో మీటర్లు మేర ఉన్న ఈ రహదారిని త్వరలో విస్తరించనున్నారు.
భీమవరం బైపాస్‌కు కొత్త ఎలైన్‌మెంట్ : దాదాపు మూడు సంవత్రరాలుగా కోర్టు కేసు కారణంగా నిలిచిపోయిన ఆకివీడు-దిగమర్రు జాతీయ రహదారి విస్తరణ, అందులోని భీమవరం బైపాస్ నిర్మాణానికి మార్గం సుగమం అయింది. భీమవరం వద్ద కొత్త ఎలైన్‌మెంట్‌తో బైపాస్ నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడంతో ఈ సమస్య కొలిక్కివచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో పామర్రు-ఆకివీడు-దిగమర్రు జాతీయ రహదారి-165 విస్తరణ మంజూరు అయింది. ఇందులో పామర్రు-ఆకివీడు మధ్య 64 KM 2 వరుసలుగా విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఆకివీడు-దిగమర్రు భాగంలో భీమవరం బైపాస్ వివాదం నెలకొంది.
భీమవరానికి ఎడమ వైపు వెళ్లేలా 18 KM మేర బైపాస్‌తో ఎలైన్‌మెంట్‌ను తొలుత ఖరారు చేయగా, కొందరు స్థానిక ప్రజలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ బైపాస్ భాగమే కాకుండా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న ఆకివీడు-దిగమర్రు మొత్తం రోడ్డు విస్తరణపై స్టే వచ్చింది. జాతీయ రహదారి వార్షిక ప్రణాళికలో దీనికి ఏటా రూ.1000 కోట్లు మంజూరు అవుతున్నా, ఎలైన్‌మెంట్ ఖరారు కాకపోవడంతో ఇప్పటి వరకు పురోగతి లేకుండా పోయింది.
తాజాగా భీమవరం వద్ద బైపాస్‌ను కుడివైపు (గొల్లవానితిప్ప వైపు) నిర్మాణం చేసేలా ఎలైన్‌మెంట్ ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో ఆకివీడు నుంచి ఉండి, వీరవాసరం, భీమవరం, పాలకొల్లు మీదుగా దిగమర్రు వరకు 43 KM మేర నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. ఇందులో ఆకివీడు నుంచి పాలకొల్లు వరకు 40 KM 4 వరుసలుగాను, మిగిలిన 3 KM 2 వరుసలుగా విస్తరణ చేస్తారు. ఫిబ్రవరి నాటికి డీపీఆర్ సిద్ధం అయితే మోర్త్ ఆమోదం తెలిపి, విస్తరణ టెండర్లు ఆహ్వానించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
ఆ రెండు రోడ్ల విస్తరణకు డీపీఆర్ : రాజమహేంద్రవరం-రంపచోడవరం ఎన్‌హెచ్‌పై 23 KM మేర 7 మీటర్ల వెడల్పుతోనే రహదారి ఉంది. దీనిని 10 మీటర్ల వెడల్పు (2 వరుసలు)తో విస్తరించేందుకు డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. విశాఖపట్నం-రాయ్‌పుర్ పాత ఎన్‌హెచ్‌లో భాగంగా సాలూరు నుంచి ఒడిశా సరిహద్దు వరకు 13 KMలను 10 మీటర్ల వెడల్పుతో విస్తరణకు డీపీఆర్ రూపొందించనున్నారు.
డీజీ పరిశీలనతో విస్తరణపై దృష్టి : కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ డైరెక్టర్ జనరల్ (DG) సారంగి కొద్ది రోజుల కిందట ఏపీకి వెళ్లి, భీమవరం వెళ్తూ కొంతదూరం కత్తిపూడి-ఒంగోలు ఎన్‌హెచ్-216పై ప్రయాణం చేచారు. ఈ సందర్భంగా దీని విస్తరణపై సూచనలు చేసినట్లు సమాచారం. దీంతో మోర్త్ అధికారులు కార్యాచరణ చేపట్టారు. కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 390 KM ఉంది. ఇందులో కత్తిపూడి-కాకినాడ మధ్య 27.5 KM మాత్రమే 4 వరుసలుగా ఉండగా, మిగిలిన ఎన్‌హెచ్ మొత్తం 2 వరుసలతోనే ఉంది. తాజాగా 4 వరుసలు ఉన్న చోట్ల 6 వరుసలుగాను, 2 ఉన్న చోట్ల 4 వరుసలుగా విస్తరించాలని ఆలోచన చేస్తున్నారు. దీనికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR) తయారీపై దృష్టి పెట్టారు.
తొలుత కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్ వరకు 229 KM వరకు విస్తరణకు డీపీఆర్ తయారీకి సలహా సంస్థ ఎంపికకు టెండర్లు ఆహ్వానించారు. ఈ నెల 8 వరకు టెండర్లకు దాఖలుకు గడువు ఇచ్చారు. ఎంపిక అయిన సలహా సంస్థ 18 నెలల్లో డీపీఆర్ తయారు చేయాల్సి ఉంటుంది. రెండో దశలో మచిలీపట్నం బైపాస్ నుంచి ఒంగోలు వరకు 161 KM. విస్తరణకు డీపీఆర్ తయారీ కోసం సలహా సంస్థ ఎంపికకు కొద్ది నెలల్లో టెండర్లను ఆహ్వానించనున్నారు. 2026 సంవత్సరం చివరి నాటికి వీటి డీపీఆర్‌లు పూర్తి అయితే విస్తరణకు కేంద్రం నిధులు కేటాయిస్తుందని అధికారులు అంటున్నారు.