IMST Device can Helps Control Blood Pressure : ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) ఒకటి. ముఖ్యంగా మారిన జీవశైలి, ఆహారపుటలవాట్లు, నిద్రలేమి, ఉప్పు అధికంగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, స్థూలకాయం.. వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇది ఒక దీర్ఘకాల సమస్య. దీనివల్ల గుండె పోటు, కిడ్నీ సమస్యలు.. వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి, అధిక రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నవారు ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకుంటూ, డాక్టర్ సలహాలు పాటిస్తూ దాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.
ఈ క్రమంలోనే చాలా మంది బీపీ కంట్రోల్లో ఉండేందుకు డైలీ వ్యాయామాలు చేస్తుంటారు. నిజానికి వ్యాయామం రక్తపోటు తగ్గడానికి తోడ్పడుతుందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే, వ్యాయామాలలో IMST డివైజ్‌తో చేసే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బీపీని తగ్గించడంలో మంచి ఫలితాలను ఇస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. అంతేకాదు, గుండె ఆరోగ్యానికి ఈ వ్యాయామాలు మేలు చేస్తున్నాయంటున్నారు. అసలేంటి IMST డివైజ్? దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
IMST(ఇన్‌స్పిరేటరీ మజిల్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్) అనేది ఒక చిన్న హ్యాండ్‌హెల్డ్ డివైజ్. 2021లో "అమెరికన్ హార్ట్ అసోసియేషన్" అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఏరోబిక్ వ్యాయామాల మాదిరిగానే IMST డివైజ్‌ని ఉపయోగించి చేసే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతాయని కనుగొన్నారు.
బీపీ చెక్ చేసేటప్పుడు ఇలా తప్పక చేయాలి! - అప్పుడే పర్ఫెక్ట్ రీడింగ్ వస్తుందట!
ఈ డివైజ్‌ని మొదటగా తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారిలో శ్వాస కండరాలను బలోపేతం చేయడానికి రూపొందించారు. ఆ తర్వాత అధిక రక్తపోటు ఉన్న 36 మంది పెద్దవారిని ఈ పరికరం సాయంతో పరీక్షించారు పరిశోధకులు. అప్పుడు వారంలో ఆరు రోజులు డైలీ 5 నిమిషాల పాటు హై రెసిస్టెన్స్ IMST బ్రీతింగ్ వ్యాయామాలు చేసిన సగం మంది ఇతరుల కంటే లో రెసిస్టెన్స్ బ్రీతింగ్ కలిగి ఉన్నట్లు కనుగొన్నారు. అంతేకాదు, ఆరు వారాల తర్వాత వారిలో సిస్టోలిక్ రక్తపోటు(పై సంఖ్య) సగటున తొమ్మిది పాయింట్లు తగ్గినట్లు గుర్తించారు.
ముఖ్యంగా IMST బ్రీతింగ్ వ్యాయామాలు చేయడం వల్ల రక్తనాళాల పనితీరులో మెరుగుదల ఏర్పడి, ధమనులను విస్తరించడంలో సహాయపడే నైట్రిక్ ఆక్సైడ్ విడుదలను ప్రేరేపిస్తున్నట్లు వెల్లడైంది. రక్తనాళాలు విప్పారటానికి నైట్రిక్ ఆక్సైడ్ తోడ్పడుతుంది. ఫలితంగా రక్తపోటూ తగ్గడానికి తోడ్పడుతున్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది. అంతేకాదు, కార్డియో వాస్కులర్ పనితీరును మెరుపర్చడంలోనూ ఈ వ్యాయామాలు సహాయపడుతున్నట్లు కనుగొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సభ్యుల బృందం జరిపిన ఒక రిసెర్చ్‌లో కూడా కార్డియో వాస్కులర్ ఎండోథెలియల్ ఫంక్షన్‌ను మెరుగుపరచడంలో IMST వ్యాయామాలు సహాయపడుతున్నట్లు కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అయితే దీనిని వైద్యుల సూచనల ప్రకారం వినియోగించాలని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బీపీ, నిద్రలేమితో మెదడుకు పెను ముప్పు - ఇలా చేయాలంటున్న నిపుణులు!