తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫోన్ ​ట్యాపింగ్ కేసు లేటెస్ట్ అప్డేట్ - ప్రభాకర్​రావుపై రెడ్​కార్నర్​ నోటీసు! - PRABHAKAR RAO RED CORNER NOTICES

Telangana Phone Tapping Case Update : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఎస్​ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావుతో పాటు మరో నిందితుడు శ్రవణ్‌రావును హైదరాబాద్‌ రప్పించే దిశగా పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. ఈ మేరకు సీఐడీ ద్వారా సీబీఐను దర్యాప్తు అధికారులు అభ్యర్ధించారు. సీబీఐ ఈ అభ్యర్ధనను ఇంటర్‌పోల్‌కు పంపాల్సి ఉంటుంది. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసే అవసరం ఉందని భావిస్తే రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేస్తుంది.

Phone Tapping Case Update
Phone Tapping Case Update (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 21, 2024, 8:25 AM IST

Telangana Phone Tapping Case Update :రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్‌ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ఎస్​ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, ఈ కేసులో ఆరో నిందితుడు శ్రవణ్‌రావును హైదరాబాద్‌కు రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరికి రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు రంగం సిద్దం చేశారు. రాష్ట్ర సీఐడీ ద్వారా సీబీఐకి అభ్యర్ధనను పంపించారు. సీబీఐ ఈ అభ్యర్ధనను ఇంటర్‌పోల్‌కు పంపించాల్సి ఉంటుంది. అనంతరం ఇంటర్‌పోల్‌ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని రెడ్ కార్నర్ నోటీస్ జారీ అవశ్యకతను గుర్తిస్తే అప్పుడు నోటీసు జారీ చేస్తుంది.

వీరిద్దరిపై బ్లూ కార్నర్ నోటీస్ జారీ చేయాలంటూ గతంలోనే హైదరాబాద్ పోలీసులు సీఐడీ ద్వారా అభ్యర్ధనను పంపించారు. అయితే అప్పటికింకా ఈ కేసులో అభియోగపత్రం దాఖలు చేయకపోవడంతో బ్లూ కార్నర్ నోటీస్ జారీ కోసం ప్రయత్నించారు. ఈ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలోనే ప్రాథమిక అభియోగపత్రాన్ని న్యాయస్థానంలో దాఖలు చేయడంతోపాటు ఈ ఇద్దరు నిందితుల్ని తమ ఎదుట హాజరుపరచాలంటూ న్యాయస్థానం ఆదేశించగా పోలీసులు చర్యలు చేపట్టారు.

వారిద్దని విచారిస్తేనే :ఈ కేసులో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను విచారించాల్సిన అవసరాన్ని వివరిస్తూ సీఐడీ ద్వారా సీబీఐకి పోలీసులు అభ్యర్ధనను పంపించారు. ఈకేసులో ఇప్పటివరకు మొత్తం ఆరుగురిని నిందితులుగా గుర్తించారు. వీరిద్దరు మినహా మిగిలిన నలుగురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే అరెస్టయిన నలుగురు ప్రభాకర్‌రావు ఆదేశాలతోపాటు శ్రవణ్‌రావు సూచనలతో తాము ఫోన్ ట్యాపింగ్ కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు దర్యాప్తు అధికారులకు వాంగ్మూలమిచ్చారు. ఈనేపథ్యంలో ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును విచారిస్తేనే కేసు దర్యాప్తు ముందుకుసాగే అవకాశాలున్నాయంటూ హైదరాబాద్ పోలీసులు న్యాయస్థానానికి విన్నవించారు.

నిందితులిద్దరూ అమెరికాలోనే :ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు ఇద్దరు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. తాము అక్కడే ఉన్నట్లు వారిద్దరు దర్యాప్తు అధికారులకు ఇదివరకే సమాచారమిచ్చారు. గత నెల 26న తాను హైదరాబాద్‌కు వస్తానంటూ ప్రభాకర్‌రావు తొలుత న్యాయస్థానానికి సైతం వెల్లడించారు. అయితే క్యాన్సర్ చికిత్స కారణంగా రాలేకపోతున్నానంటూ ఇటీవలే మరోమారు సమాచారమిచ్చారు. న్యాయస్థానం అంగీకరిస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని అభ్యర్థించారు. అయితే న్యాయస్థానం నుంచి అందుకు అనుమతి లభించలేదు.

రెడ్​కార్నర్ నోటీస్​ జారీ అయితే :ఈనేపథ్యంలో రెడ్‌ కార్నర్‌ నోటీస్ గనక జారీ అయితే వారిద్దరిని అమెరికాలోనే ప్రొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దర్యాప్తు అధికారుల అభ్యర్ధనను అమెరికా పోలీసులు పరిగణనలోకి తీసుకుంటే ఇలా జరిగే అవకాశముంది. తొలుత వారిద్దరిని ప్రొవిజనల్ అరెస్ట్ చేసిన అనంతరం అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచి ఆ తరువాత భారత్‌కు పంచవచ్చు.

అదే సమయంలో ప్రొవిజనల్ అరెస్టుకు సంబంధించి దర్యాప్తు అధికారులకు సైతం సమాచారం అందిస్తారు. అప్పుడు వీరిద్దరు భారత్‌లోని ఏ విమానాశ్రయంలో దిగినా అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపి దర్యాప్తు అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులను విచారిస్తే ట్యాపింగ్‌ విషయంలో మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్​ - వెలుగులోకి ప్రభాకర్​ రావు లేఖ - PRABHAKAR RAO ON PHONE TAPPING

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో మలుపు - ఇప్పట్లో రాలేనన్న ప్రభాకర్​రావు - బ్లూకార్నర్ నోటీసు జారీ అనుమానమే - PRABHAKAR RAO IN PHONE TAPPING CASE

ABOUT THE AUTHOR

...view details