Telangana Cabinet Meeting 2024 : రాష్ట్ర కేబినెట్ సమావేశం ఇవాళ సచివాలయంలో జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ప్రభుత్వ శాఖలు వివిధ అంశాలపై వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగి పదేళ్లు పూర్తి కానున్నందున, పునర్విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు.
పునర్విభజన చట్టంలోని షెడ్యూలు 9, 10లోని వందకుపైగా ఆస్తుల విభజన, హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాల స్వాధీనం, బకాయిల వివాదాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన వివరాలతో నివేదిక తయారు చేస్తున్న ఆర్థిక శాఖ కేబినెట్ ముందు పెట్టనుంది. ఏపీతో చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేసి కొన్ని అంశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
రైతు రుణమాఫీపై సీఎం స్పెషల్ ఫోకస్ : రైతు రుణమాఫీపై కూడా మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల ఎన్నికల సందర్భంలో ప్రజలకు హామీ ఇచ్చినందున, ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసి తీరాల్సిందేనని సీఎం చెబుతున్న నేపథ్యంలో దానికోసం నిధుల సమీకరణ, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. సుమారు 42 లక్షల మంది రైతులకు రుణమాఫీకి సుమారు రూ.32,000 కోట్ల నిధులను ఎలా సమకూర్చుకోవాలనే అంశంతో పాటు విధివిధానాలపై అధికారులకు మంత్రివర్గం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
CM Revanth Review On Income Sources : రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు వనరుల సమీకరణ, ప్రత్యామ్నాయ, నూతన మార్గాల అన్వేషణపై కేబినెట్ చర్చించనుంది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, గనులు, తదితర శాఖలతో సమావేశం నిర్వహించి, బడ్జెట్ అంచనాల మేరకు ఆదాయాన్ని సాధించాలని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కూడా కేబినెట్ సమీక్షించనుంది.