గత ప్రభుత్వ విధానాలతో ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని భట్టి అన్నారు. దిద్దుబాటు చర్యలు చేపట్టి మేలైన ప్రాజెక్టులు నిర్మిస్తామని తెలిపారు.
ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు చెల్లిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్ర అప్పులు తీర్చేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.
ఇప్పటివరకు రూ.34,579 కోట్లు వివిధ పథకాలకు ఖర్చు చేశామని తెలిపారు. కొత్త ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి, నియామకాల్లో పారదర్శకతకు చర్యలు చేపట్టామని అన్నారు. త్వరలో నియామక ప్రణాళిక క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. రైతుభరోసా సహా హామీలన్నీ త్వరలోనే అమలు చేసి తీరుతామన్నారు.
బడ్జెట్ కేవలం అంకెల సమాహారం కాదని బడ్జెట్ అనేది విలువలు, ఆశల వ్యక్తీకరణ కూడా అని అన్నారు. జిల్లాల మధ్య ఆదాయ అంతరాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. అసమానతలు లేని సమసమాజ స్థాపన దిశగా అడుగుల వేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ ఏడాది నుంచి పీఎం ఫసల్‌బీమా యోజనలో చేరాలని నిర్ణయించామని తెలిపారు. రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు.
రైతులకు పైసా ఖర్చు లేకుండా పంటలకు పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. వరి రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించారు. కమిటీ అధ్యయనం తర్వాత ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చేస్తామని తెలిపారు.
బడ్జెట్‌లో సింహభాగం వ్యవసాయానికే కేటాయించామన్నారు.రైతుల తలరాతలు మార్చే చారిత్రక నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఉచిత బస్సు పథకం సొమ్ము నెలవారీగా ఆర్టీసీకి ఇస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బిలియన్ డాలర్ కార్పొరేషన్‌గా అవతరణకు దోహదపడుతుందన్నారు.
రూ.63 లక్షల మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం రూపొందించారు. స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకుల అనుసంధానంతో రూ.లక్ష కోట్ల ఆర్థిక సాయం. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేంకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. శాసనసభ శనివారానికి స్పీకర్ వాయిదా వేశారు.