BJP MLAS Fires on Congress Party : శాసనసభలో కాంగ్రెస్ తీరు చూస్తుంటే ఆరు గ్యారంటీలను విస్మరించేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్లలో కేంద్రం తెలంగాణకు పది లక్షల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ఆరు గ్యారంటీలను అమలు చేసేవరకు వెంటాడుతామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు.
కంటోన్మెంట్ భూముల అంశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి మరిచిపోయారన్నారు. శాసనసభ రేపటికి వాయిదా పడిన తరువాత సహచర ఎమ్మెల్యేలతో కలిసి మీడియా పాయింట్ వద్ధ మాట్లాడిన శంకర్, ఆర్‌ఆర్‌ఆర్ అంశంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. బీజేపీపై ఉన్న కక్ష్యపూరితమైన చర్యలను అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ నేతలు బయటపెట్టుకున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి విమర్శించారు.
"కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలల కాలంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను అమలు చేయకపోవడం కారణంగా, ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవటానికే ఈ తీర్మానం. ఆ వ్యతిరేకతను కేంద్రంపై నెట్టాలనే ఇవాళ శాసనసభలో బడ్జెట్‌పై తీర్మానం ప్రవేశపెట్టారు. ఆరు గ్యారంటీల హామీలను అమలు చేసేంత వరకు బీజేపీ నిలదీస్తుంది."-పాయల్ శంకర్, బీజేపీ ఎమ్మెల్యే