TDP Leaders Condemn Prathipati Sarath Arrest : జీఎస్టీ అధికారుల ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు టీడీపీ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను (Prathipati Sarath) అరెస్ట్ చేశారు. శరత్‌ను టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఆయనపై జీఎస్టీ విభాగం మనీలాండరింగ్, పన్ను ఎగవేత అభియోగాలు మోపింది. ఐపీసీ 420, 409, 467, 471, 477(ఏ), 120 బీ రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద మాచవరం పీఎస్‌లో కేసు నమోదయింది. ప్రత్తిపాటి కుమారుడు, భార్య, బావమరిది సహా ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ప్రత్తిపాటి కుమారుడిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ టీడీపీ కార్యకర్తలు సీపీ కార్యాలయానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్ధృతంగా మారింది.
అమరావతిని విచ్ఛిన్నం చేసేలా వైఎస్ఆర్సీపీ కుట్రలు- భూసేకరణ ప్రకటన ఉపసంహరణకు కసరత్తు
Chandrababu on Prathipati Sarath Arrest : మాజీ మంత్రి ప్రత్తారాటి పుల్లారావు కుమారుడు శరత్‌ది అక్రమ అరెస్ట్ అని, ముమ్మాటికి ఇది ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని ఎక్స్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)ఆరోపించారు. ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్ కక్ష సాధింపు రాజకీయాలు మరింత తీవ్రమయ్యాయని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తమ పార్టీ నాయకులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగమే శరత్ అరెస్ట్ అని, ఆయనను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ అఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ద్వారా అక్రమ కేసులు పెట్టి టీడీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తమ పార్టీ నాయకులను వేధించడానికి సీఐడీని తన జేబు సంస్థగా మార్చుకున్నట్లే, ఇప్పుడు ఏపీఎస్ఆర్డీఐ ద్వారా కూడా రాజకీయ కక్షలను తీర్చుకుంటోందని దుయ్యబట్టారు. ఎన్నికల ముంగిట పార్టీ అభ్యర్థులను బలహీన పరిచేందుకే ఈ కుట్రలని విమర్శించారు. ఏపీఎస్ఆర్డీఐ బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక వివిధ వర్గాల వ్యాపారులు కోర్టుకు వెళ్లింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 40 రోజుల్లో ఇంటికి పోయే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అనుబంధ విభాగ సభ్యులుగా పని చేస్తే, అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.
Nara Lokesh Condemn Prathipati Sarath Arrest : శరత్‍ను తీసుకెళ్లింది పోలీసులా, సైకో జగన్ తాడేపల్లి ముఠానా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh)ప్రశ్నించారు. టెర్రరిస్టుని అరెస్ట్ చేసినట్టు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని నిలదీశారు. శరత్‌కి ఏమైనా హాని తలపెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని నారా లోకేశ్ వివరించారు.