Success Story Of Organic Farmer Venkataswamy :జీవితంలో ఎత్తుపల్లాలు సర్వసాధారణం. కటిక దరిద్రుడైనా పట్టుదలతో పనిచేస్తే కోటీశ్వరుడు కావచ్చు. ఎంత డబ్బున్న వారైనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే దరిద్రుడిగా మారవచ్చు. ఆదిలాబాద్ జిల్లా పిప్పల్ కోటికి చెందిన వెంకటస్వామి అనే వ్యక్తి 30 ఏళ్ల కిందట ఓ నిరుపేద. యజమాని ఎగతాళిని ప్రేరణగా తీసుకొని ఇప్పుడాయన కోటీశ్వరుడిగా మారాడు. సొంతంగా కుట్టుమిషన్ పెట్టి నలుగురుకి ఉపాధినిస్తున్నాడు. మరోవైపు ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ మట్టిని ముడితే బంగారం అవుతుందని నిరూపించారు.
వెంకటస్వామి వయస్సు 55 సంవత్సరాలు. 30ఏళ్ల కిందట కుటుంబ పోషణ కోసం ఆదిలాబాద్‌లోని ఓ వడ్రంగి దుకాణంలో దినసరి కూలీగా చేరారు. ఓ రోజు ఆయన బంధువొకరు అతన్ని కలిసేందుకు దుకాణం వద్దకు రాగా బయటకి వెళ్లి టీ తాగి వస్తానని యజమానిని కోరారు. అందుకు యజమాని అంగీకరించకపోగా బంధువు ఎదుటనే మీకు చుట్టాలున్నారా? అని ప్రశ్నించారు. కళ్లల్లో నీళ్లుతిరిగిన వెంకటస్వామి అదేరోజు పనిమానేశారు.
తనే యజమానిగా మారి కుట్టుమిషన్ దుకాణం తెరిచి మరో ఐదుగురికి ఉపాధి కల్పించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2019లో ఆదిలాబాద్‌లోని కేఆర్కే కాలనీలో ఓ ఫాంహౌస్ ఏర్పాటు చేశారు. సేంద్రీయ ఎరువులతో ఆధునిక పద్ధతిలో సాగుచేయడం ప్రారంభించారు. ఇప్పుడది ఫలాలు అందిస్తున్న కల్పతరువుగా మారింది. ఫాంహౌస్‌తోపాటు కుట్టుమిషన్ పనిని నిర్వహిస్తున్న వెంకటస్వామి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.