Electric Vehicle Charging Stations :ఆంధ్రప్రదేశ్‌లో మొదట ఏర్పాటు చేసే 500 ప్రైవేట్ ఛార్జింగ్ కేంద్రాలకు మాత్రమే రాయితీలు వర్తింపజేయనుంది. ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను నోడల్ ఏజెన్సీగా నూతన పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్) పర్యవేక్షించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలను కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల స్థలాల్లో ఏర్పాటు చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్లలో వినియోగించిన విద్యుత్‌పై నిర్వాహకుల నుంచి యూనిట్‌కు రూపాయి చొప్పున లీజుగా వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుకు ప్రాధాన్యం : రాష్ట్రంలో బహిరంగ ప్రదేశాల్లో ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో ప్రాంతాలను గుర్తించింది. డిమాండ్ రెస్పాన్స్ మేనేజ్‌మెంట్ ఆధారంగా స్మార్ట్ ఈవీ ఛార్జింగ్ కేంద్రాల నిర్వహణకు ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. టెండర్ల ప్రక్రియ ద్వారా ఛార్జింగ్ పాయింట్ ఆపరేటర్లను నెడ్‌క్యాప్ ఎంపిక చేసేలా ప్రతిపాదించింది.
అవసరమైన ఇన్‌పుట్ విద్యుత్‌ను ఓపెన్ యాక్సెస్/ గ్రీన్ అమ్మోనియా జనరేటర్ నుంచి తీసుకునే వెసులుబాటును నిర్వాహకులకే కల్పించాలని నిర్దేశించింది. వివిధ కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో మొదట ఏర్పాటు చేసే 150 ఛార్జింగ్ కేంద్రాలకే ప్రభుత్వం నిర్దేశించిన రాయితీలు అందుతాయి. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.