Is Criminality Increasing Among Children? :చిన్నారుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోందా? ప్రవర్తనలో విచిత్రమైన మార్పులు వస్తున్నాయా? తల్లిదండ్రుల అతి గారాబమనేది తీవ్ర పరిణామాలకు దారి తీస్తోందా? యాంత్రిక జీవితము కూడా ఓ కారణమా? గంజాయి, మత్తుపదార్థాలు విచ్చలవిడిగా దొరకడం ప్రమాదంలోకి నెట్టేస్తుందా? తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానాన్నిస్తున్నాయి.
కొన్ని నెలల కిందట ఆంధ్రప్రదేశ్లోని పీలేరులో ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు గంజాయి మత్తులో ట్రైన్ ప్రమాదానికి గురై మృతిచెందారు. కొన్ని రోజుల కిందట బద్వేలులో ఓ విద్యార్థినిని లవ్ పేరుతో వివాహితుడైన ఓ యువకుడు వెంటపడి వేధించడమే కాకుండా పెట్రోలు పోసి ఆమెను నిప్పటించి అంతమొందించాడు.
రాయచోటి ఘటన ఓ హెచ్చరిక :ఇటీవల తమ పిల్లలు గంజాయి, మత్తుపదార్థాలకు అలవాటు పడి తమపైనే దాడులకు పాల్పడుతున్నారని కడప నగరానికి చెందిన కొంతమంది తల్లులు, ప్రజాప్రతినిధులు, పోలీసుశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. తాజాగా రాయచోటి పట్టణంలో ఓ టీచర్ మృతికి ముగ్గురు 9వ తరగతి స్టూడెంట్స్ కారణమయ్యారు. ఇలాంటి ఉదంతాలు సర్వత్రా తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవన్నీ తల్లిదండ్రుల లోకానికే హెచ్చరికలిస్తున్నాయి. వెంటనే మేల్కోవాలంటూ గుర్తుచేస్తున్నాయి.
పిల్లల్లో పెరుగుతున్న పెడ ధోరణులు :ఈ ఆధునిక కాలంలో విద్యార్థులు, యువత అసాంఘిక కార్యకలాపాలతో వింత పోకడలను అనుసరిస్తున్నారు. అడ్డదారిలో ప్రయాణిస్తూ తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారు. మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాలు లాంటి మత్తుపదార్థాలను వినియోగిస్తూ విచక్షణ కోల్పోతున్నారు. పిల్లల్లోని ఇటువంటి పెడ ధోరణులను గుర్తించి వారిని దారిలో పెట్టాల్సిన గురుతర బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. కొంతమంది పిల్లల డిమాండ్లను రెండో ఆలోచన లేకుండా తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు.
బాల్యంలో సరిగ్గా లేని పరిసరాల వాతావరణం, కుటుంబ బంధాలు అంతంత మాత్రంగా ఉండడం, చెడు స్నేహాలు ఎక్కువగా యువత పక్కదారుల్లో ప్రయాణించేందుకు ప్రధాన కారణాలవుతాయని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆధునిక యుగంలో కంప్యూటర్లు, సెల్ఫోన్లకు బానిసలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పుస్తక పఠనం, క్రీడలకు బదులు స్మార్ట్ఫోన్లతో కాలం గడపటం ఎక్కువైంది. బాల్యంలోనే పిల్లల ప్రవర్తనను గుర్తించగలిగి వారికి తగిన సూచనలిస్తూ సరైన దారిలో నడిపిస్తే మంచి పౌరులుగా తయారవుతారు. బాల్యంలో తల్లిదండ్రుల నిర్లక్ష్య ధోరణి, పేలవమైన పర్యవేక్షణ యుక్తవయసులో వారు పక్కదారి పట్టడానికి కారణమవుతున్నాయి.
రాయచోటి ఘటన ఓ గుణపాఠమే :తాజాగా ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో ఓ టీచర్ మృతికి ముగ్గురు 9వ తరగతి విద్యార్థులు కారణమైన ఘటన తల్లిదండ్రులకు కూడా ఓ గుణపాఠమే. ఆ ముగ్గురిలో కవలలైన ఇద్దరు విద్యార్థులది పేద కుటుంబం. తండ్రి లారీ డ్రైవరుగా పనిచేస్తూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. తండ్రి వృత్తిరీత్యా బయటకు వెళ్లినప్పుడు తల్లి మాటలను పెడచెవిన పెట్టి జులాయిగా తిరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు.
వారి చుట్టూ ఉండే అల్లరి మూకల సావాసాలు సైతం వీరిని అసాంఘిక కార్యకలాపాల వైపు మళ్లేవిధంగా చేశాయి. క్లాస్ రూంలో అల్లరి చేస్తుండగా ఉపాధ్యాయుడు మందలించడాన్ని జీర్ణించుకోలేని ఆ 3 విద్యార్థులు ఆయనపై తిరుగుబాటు చేయడంతో ఉపాధ్యాయుడు మృతిచెందారు. ఈ ఘటనతో ఆ ముగ్గురి విద్యార్థుల జీవితాలు అంధకారమయ్యాయి. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ సోషల్ మీడియాలో హెచ్చరికలు తీవ్రమవుతున్నాయి.
మెగా పేరెంట్ టీచర్స్ మీట్ :ఎన్డీయే సర్కారు పాఠశాలల్లో శనివారం ‘మెగా పేరెంట్ టీచర్స్ మీట్’ పేరిట అతిపెద్ద కార్యక్రమం నిర్వహించతలపెట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహిస్తోంది. విద్యార్థుల ప్రతిభపై వ్యక్తిగతంగా చర్చించడంతో పాటు వారి అలవాట్లు, వారిలో తీసుకురావాల్సిన మార్పులు గుణగణాలు అంశంపై చర్చించనున్నారు. విద్యార్థుల ప్రగతి, సృజనాత్మకత, భవిష్యత్తుపై తల్లిదండ్రులు, టీచర్ల మధ్య చర్చ జరగనుంది. దేశంలో దిల్లీ తర్వాత రాష్ట్రంలోనే అతి పెద్ద కార్యక్రమాన్ని సదుద్దేశంతో నిర్వహణకు భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. సమావేశం అనంతరం అందరూ కలిసి భోజనం చేసేవిధంగా ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమం తల్లిదండ్రులకు ఎంతో ఉపయుక్తం కానుంది.
పిల్లలకు అతి గారాబం చేయొద్దు :'ప్రమాదకరమైన ప్రవర్తనతో కలిగే దుష్పరిణామాలపై తల్లిదండ్రులు తమ పిల్లలతో చర్చిస్తూ ఉండాలి. పేరెంట్స్ బలహీనతలను గుర్తించడంలో పిల్లలకు ప్రావీణ్యం ఎక్కువ. వారి అభ్యర్థలను అతి గారాబంతో అంగీకరించినట్లయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గ్రహించాలి. పేరెంట్స్కు బలమైన క్రమశిక్షణ వ్యూహాలు అవసరం. పిల్లలు, యువతలో హింసాత్మక ధోరణి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అలాంటి వారిపై నిఘా పెట్టి చెడు అలవాట్లు ఉన్నవారికి మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించాలి. సోషల్ మీడియాపై ప్రభుత్వాలు నియంత్రణ తీసుకురావాలి. ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల వయసులోపు పిల్లలు సామాజిక మాధ్యమాల వాడకాన్ని నిషేధించిన తరహాలో దేశంలోనూ చట్టాలు తీసుకురావాలి' అని కన్సల్టెంట్ సైక్రియాట్రిస్ట్ డాక్టర్ కవితాప్రసన్న తెలిపారు.
పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక పేరెంట్స్ అడగాల్సిన ప్రశ్నలివే! ఎందుకో తెలుసా?
ఉపాధ్యాయుడిపై విద్యార్థుల దాడి! - కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలొదిలిన టీచర్