Statistics Says Changing Our Lifestyle For Better Life :మన జీవన విధానం మారడం మూలంగా సామాజిక, ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నూతన సంవత్సరంలో జీవన ప్రణాళికను మార్చుకోవాలి. ఇటీవల కాలంలో వెలువడిన అధ్యయనాల్లో వెల్లడి అయిన గణాంకాలతో వ్యక్తిగత జీవనానికి అన్వయించుకొని, అందుకు అనుగుణంగా గమనాన్ని మార్చుకుని పయనం చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.
55 కిలోల ఆహారం వృథా :ఒక భారతీయుడు సంవత్సరానికి సగటున 55 కిలోల ఆహారం వృథా చేస్తున్నారు. దీని ఫలితంగా సహజ వనరులు హరించుకుపోవటం, పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దీంతో ఆకలి బాధలు తప్పడం లేదు. ఉమ్మడి గద్వాల్ జిల్లాలో సుమారు సంవత్సరానికి 23,000 వరకు పెళ్లిలు జరుగుతుంటాయి. ఇటువంటి శుభకార్యాల్లో 20 శాతం పైగా ఆహారం వృథా అవుతుందని అంచనా. ఆహారాన్ని వృథా చేయడం అరికట్టాల్సిన అవసరం ఉంది.
45 లీటర్ల నీరు వృథా : ఒక వ్యక్తి రోజువారీగా సగటున 45 లీటర్ల నీరు వృథా చేస్తున్నారు. జలాన్ని తయారు చేసే శక్తి లేదు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న నీటినే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకే మనకు నీరు అందించే ఉపరితల భూగర్భ జలాన్ని పొదుపుగా వినియోగించుకుందాం. జిల్లాలో ప్రతి ఒక్కరికి స్థానిక సంస్థలు రోజుకు 100 నుంచి 120 లీటర్ల నీరు అందిస్తున్నాయి. వివిధ కారణాలతో వారు అందించిన నీటిలో సగానికి పైగా వృథాగా కాలువల్లో కలిసిపోతుంది.
2012 యూనిట్లు :తెలంగాణ రాష్ట్రంలోని పౌరుడు 2012 యూనిట్ల వార్షిక విద్యుత్ వినియోగిస్తున్నారు. నిజంగానే ఇంత వార్షిక విద్యుత్తు అవసరమా అనేది పరిశీలన చేసుకోవాలి. విద్యుత్‌ను ఎంత సేవ్ చేస్తే, అంత సృష్టించినట్లేనని మనం గుర్తించుకోవాలి. పైగా కాలుష్యం ఎంతో కొంత తగ్గించడంలోనూ మనం సహాయపడిన వాళ్లం అవుతాం. ఉమ్మడి జిల్లాలో 12 లక్షలకు పైగా గృహ వినియోగ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. చాలా మంది అవసరం ఉన్నా, లేకపోయినా విద్యుత్తు దీపాలు, ఫ్యాన్లు వేస్తున్నారు. కరెంట్ బిల్లు చెల్లించే స్థోమత ఉంది కదా అని ఇలా చేస్తే తెలియకుండా సమాజానికి నష్టం చేసినట్లుగా ప్రతి ఒక్కరూ భావించాలి.
వ్యాయామానికి టైం కేటాయించాలి :భారతీయుల్లో శారీరక కదలికలు తక్కువగా ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా మంది వ్యాయామం లేక శరీరంలో కొవ్వు పేరుకుపోయి రక్తపోటు, అధిక బరువు, మధుమేహం బారినపడుతున్నారు. వ్యాయామానికి టైం కేటాయించాలని ఈ కొత్త సంవత్సరం ఓ వృతిగా ఎన్నుకుందాం. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రక్త పోటుతో 2.81 లక్షలు, మధుమేహంతో 1.49 లక్షల మంది బాధపడుతున్నారు.