Srikakulam District Jawans Died in Terrorist Firing:జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి చెందిన జవాన్లు డొక్కరి రాజేశ్, సనపల జగదీశ్వరరావు మృతి చెందారు. జవాన్ల మృతితో వారి స్వగ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. జవాన్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని గ్రామస్థులు, మిత్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
పేద కుటుంబంలో పుట్టిన రాజేశ్ సైన్యంలో చేరి దేశానికి సేవలందిస్తున్నందుకు ఎంతో గర్వించామని అతని స్నేహితులు, గ్రామస్థులు తెలిపారు. గ్రామానికి రాజేశ్ ఎంతో సహాయం చేశారని గుర్తు చేసుకున్నారు. అందరితో కలివిడిగా ఉండే రాజేశ్, ముష్కరులతో పోరాటంలో ఈ ఉదయం చనిపోవడం జీర్ణించుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జవాన్ల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు. జవాన్ రాజేశ్ కుటుంబసభ్యులతో కేంద్రమంత్రి రామ్మోహన్, మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు.
'జవాన్ల త్యాగాలను దేశం మరవదు'
Minister Kinjarapu Atchannaidu on Jawans Died: జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఆర్మీ సైనికుల మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి చెందిన ఇద్దరు సైనికులు సనపల జగదీశ్వరరావు, డొక్కరి రాజేశ్ మృతి ఎంతో బాధ కలిగించిందని విచారం వ్యక్తం చేశారు. దేశం కోసం, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన జగదీశ్వరరావు, రాజేశ్లకు దేశ ప్రజలంతా ఎప్పటికీ రుణపడి ఉంటారని అన్నారు. దేశ ప్రజల రక్షణ కోసం అను నిత్యం పనిచేస్తున్న జగదీశ్వరరావు, రాజేశ్ కుటుంబ సభ్యులకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Kinjarapu Ram Mohan Naidu Response: శ్రీకాకుళానికి చెందిన ఇద్దరు వీర జవాన్లు రాజేశ్, జగదీశ్వరరావులను కోల్పోయినందుకు బాధగా ఉందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. జవాన్ల మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకొస్తున్నామని తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్- ఆర్మీ అధికారి, జవాన్ వీరమరణం