Special Story on All Water Resources to Hyderabad : హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలతో పాటు మూసీ పునరుజ్జీవంలో భాగంగా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు గోదావరి నీటిని మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మూడు ప్రత్యామ్నాయాలపై పనులు మొదలుపెట్టింది. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో కూడా ఎలాంటి సమస్య లేకుండా తాగనీరు సరఫరా చేయగలగడం, భూసేకరణ తక్కువగా ఉండటం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది.
కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్, సంగారెడ్డి కాలువ నుంచి రావల్‌కోడ్ వద్ద నీటిని మళ్లించే ప్రదిపాదనలపై అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకోనుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఈ అంశంపై పురపాలక, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం జరిగింది. మూడు ప్రతిపాదనలను పరిశీలించి వాటిలో ఏది మెరుగైంది తదితర అంశాలపై అధ్యయనం చేసి తుది నిర్ణయానికి రావాలని సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో రెండు శాఖలు సంయుక్తంగా పని చేస్తున్నాయి. గోదావరి నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీల కేటాయింపుగా ఉండగా, మొదటి దశలో ఎల్లంపల్లి నుంచి పది టీఎంసీలు నీటిని తీసుకుంటున్నారు. రెండో దశ కింద హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు, మూసీ పునరుజ్జీవం కోసం 5 టీఎంసీలు కలిపి 15 టీఎంసీలు తీసుకోవాలని తెలిపారు. తాజాగా 20 టీఎంసీలను మళ్లించాలని యోచిస్తున్నారు.
తాగునీటికి మాత్రమే ఉపయోగపడుతుంది :కొండపోచమ్మసాగర్ నుంచి నీటిని తీసుకుంటే మల్లన్నసాగర్ నుంచి తీసుకొనే దానికి సంవత్సరాని అయ్యే నిర్వహణ ఖర్చు కన్నా రూ.50 కోట్లు ఎక్కువ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మల్లన్నసాగర్ సామర్థ్యం ఎక్కువ కావడం, డెడ్ స్టోరేజీలోనే ఐదు టీఎంసీలు అందుబాటులో ఉండటం, ఈ నీటిని తాగునీటికి మాత్రమే వినియోగించడానికి వీలవుతుంది అందుకు ఏడాది పొడవునా ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. అయితే మూడు ప్రతిపాదనలను బేరీజు వేసి నిర్ణయానికి రానున్నట్లు సంబంధిత వర్గాల నుంచి సమాచారం.
కాళేళ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మసాగర్ నుంచి పది టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి అవసరాలను మళ్లించేందుకు 2017 అక్టోబరు 24న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేశవాపురం వద్ద పది టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించడం, కొండపోచమ్మసాగర్ నుంచి కేశవాపురానికి ఐదు టీఎంసీలు, నేరుగా ఘనపూర్ వద్ద మరో ఐదు టీఎంసీలు మళ్లించడం, రెండు నీటి శుద్ధీకరణ ప్లాంట్లు ఏర్పాటు చేయడం దీని ప్రధాన లక్ష్యం.
భూసేకరణ ముఖ్యం : ఈ పని విలువను 4,777.59 కోట్ల రూపాయలుగా అంచనా వేయగా, ఈ పనిని హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించింది. దీని ప్రకారం పదేళ్లలో చెల్లించాల్సిన మొత్తం 7,212.78 కోట్ల రూపాయలుగా ఉత్తర్వులో పేర్కొంది. ఇందులో అంచనా ఖర్చులో 20 శాతం, భూసేకరణ వ్యయం కలిపి ప్రభుత్వ వాటా రూ.1,260.67 కోట్లు అవ్వగా, నిర్మాణం చేపట్టే సంస్థ మిగిలిన 80 శాతం కింద రూ.3,516.92 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. టెండర్లలో అంచనాపై 3.45 శాతం ఎక్కువ కోట్ చేసి ఎల్-1గా నిలిచిన ఎంఇఐఎల్కు ఈ నిర్వహణ పనిని అప్పగిస్తూ 2018 ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జులై 8న అప్పటి సీఎం వద్ద జరిగిన సమావేశంలో భూసేకరణ సమస్యను పరిగణనలోకి తీసుకొని 5 టీఎంసీల సామర్థ్యంతో కేశవాపురం రిజర్వాయర్ నిర్మించాలని, ప్రభుత్వ, అటవీ భూమిలో 5.04 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను రూ.3,363.37 కోట్లతో నిర్మించడంతోపాటు కొండపోచమ్మ నుంచి ఘనపూర్‌కు పది టీఎంసీల మళ్లింపు పనిని ఎం.ఇ.ఐ.ఎల్‌కు కట్టుబెట్టింది.