Formula E-Car Race Latest News : ఫార్ములా -ఈ కార్ రేస్‌పై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటు అయ్యింది. ఈ దర్యాప్తు ఏసీబీలోని సీఐయూ ఆధ్వర్యంలో కొనసాగనుంది. సీఐయూ డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పనిచేయనున్నట్లు సమాచారం. ఈ కేసును ఎస్పీ స్థాయి అధికారి నిరంతర పర్యవేక్షణలో ప్రభుత్వం విచారణ జరుపనుంది. ప్రస్తుత ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి ఐపీఎస్ ఈ కేసును ఎప్పటికప్పుడు పర్యవేక్షించునున్నారు. ఏసీబీ హెచ్ఎండీఏతో పాటు పలు శాఖల నుంచి ఫైల్స్ తెప్పించుకుంటోంది. ఎస్ ఎక్స్ అనే కంపెనీతో ఉన్న ఒప్పందాలను మొదటగా పరిశీలించాలని ఏసీబీ భావిస్తోంది.
వేగం పెంచిన ఏసీబీ : ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో విచారణను ఏసీబీ మరింత వేగవంతం చేసింది. ఫార్ములా-ఈలో అక్రమాలు జరిగినట్లు ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న దాన కిషోర్ స్టేట్‌మెంట్ ఏసీబీ రికార్డ్ చేయనున్నట్టు సమాచారం. ఫార్ములా- ఈ రేస్‌కు సంబంధించి రూ.54 కోట్ల 88 లక్షల అక్రమాలు జరిగాయని ఏసీబీకి కేసు నమోదు చేసింది. ఫిర్యాదులో ప్రైవేట్ కంపెనీకి డబ్బు చెల్లించడంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడిందని పేర్కొన్నారు.