Sons Attack On Father For Marriage :ఇంట్లో పెళ్లీడు వచ్చిన పిల్లలు ఉంటే, వారు అడగక ముందే తల్లిదండ్రులు సరైన జోడి చూసి వివాహం చేస్తారు. లేదా పిల్లలను అడిగి ఆ తంతు గురించి ముందడుగు వేస్తారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ ఫుల్ రివర్స్. పిల్లలే పెళ్లి కావాలని ఆ తండ్రిని ఇబ్బంది పెట్టారు. పెళ్లీడు వచ్చినా పట్టించుకోవడం లేదని పంచాయితీలోకి లాగారు. అంతటితో వదిలేశారా అంటే అదీ కాదు, చివరకు గొడవ పడి ఆ తండ్రి కాళ్లు విరగ్గొట్టారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
'పెళ్లీడు వచ్చినా మాకు ఇంకా వివాహాలు చేయవా?' - తండ్రితో గొడవపడి కాళ్లు విరగ్గొట్టిన కుమారులు - SONS ATTACK ON FATHER FOR MARRIAGE
పెళ్లి చేయడం లేదని తండ్రిపై కుమారుల దాడి - ఏపీలోని కర్నూల్ జిల్లాలో ఘటన
Published : Nov 23, 2024, 10:56 AM IST
పలుమార్లు పంచాయితీ :కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని,పెళ్లీడు వచ్చినా వివాహాలు చేయడం లేదన్న కారణంతో తండ్రిపై ఆవేశం పెంచుకుని కుమారులు దాడి చేసిన ఘటన గోనెగండ్లలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం గోనెగండ్ల గ్రామానికి చెందిన మంతరాజు, ఆదిలక్ష్మి దంపతులు కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందులో మొదటి కుమార్తెకు వివాహం చేయగా, మిగతా ముగ్గురికి ఇంకా కాలేదు. దీంతో పిల్లల వివాహాలను పట్టించుకోవడం లేదని ఇద్దరు కుమారులు పలుమార్లు పంచాయితీ పెట్టించారు.
కుమారుల దాడిలో రెండు కాళ్లు విరిగిపోయాయి : వివాహం చేయాలని తండ్రిని ఒత్తిడికి గురి చేశారు. పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీ పెట్టించారు. ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన పంచాయితీలో ఉద్రేకానికి గురైన ఇద్దరు కుమారులు ఉదయం ఇంట్లో తండ్రి మంతరాజుపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన రెండు కాళ్లు విరిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కుమారులకు నచ్చజెప్పారు. మంతరాజును చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయమై గోనెగండ్ల సీఐ గంగాధర్ మాట్లాడుతూ గొడవ జరిగిన విషయం నిజమేనన్న ఆయన, బాధితుడు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపారు.