A Boy Died With Electric Shock : చిన్నతనంలో ఆడాల్సిన ఆటలు, చేయాల్సిన పనులు ఆ వయస్సులోనే చేయాలి. ఎందుకంటే పెరిగే కొద్ది అవి ఒక్కోక్కటిగా దూరమవుతుంటాయి. ఆ రోజులు మళ్లీ జీవితంలో రానేరావు. అందుకే పిల్లలు ఆటలు ఆడుతూ సంతోషంగా గడిపేస్తుంటే ఎవరికైనా వారి జీవితం గుర్తుకు వస్తుంటుంది. అల్లరి చేయడం చిన్నతనంలోనే ఉంటుంది. తర్వాత మొదలయ్యే పరుగుల జీవితం, ఎవరికైనా తీవ్రమైన ఒత్తిడితో ఉంటుంది. కానీ ఆ చిన్న చిన్న ఆనందాలు పొందడం కోసం చిన్నారులు చేస్తున్న పనులకు వారి ప్రాణాలు బలి అవుతున్నాయి. దీంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నాయి. ఆ తల్లిదండ్రులకు దిక్కు తోచని పరిస్థితి ఎదురవుతోంది.
నిజామాబాద్ జిల్లాలోని కుర్నాపల్లి గ్రామంలో షేక్ మతిన్ అనే బాలుడు గాలిపటం ఎగరేస్తుంటే అది మెల్లిగా కిందకు దిగుతూ వచ్చినట్టు వచ్చి దగ్గరలోని ఓ చెట్టుపై వాలింది. పతంగి కోసం చెట్టు ఎక్కాలని నిర్ణయానికొచ్చాడు. మెల్లగా చెట్టు ఎక్కడం ప్రారంభించాడు. గాలిపటాన్ని అందుకునేందుకు ఆసరాగా ఉంటుందని ఓ ఇనుప కడ్డీని వెంట తీసుకొని చెట్టు ఎక్కాడు.
కరెంట్ షాక్ : గాలిపటానికి కొంచెం దూరంలో ఉండి దానిని తీయడం ప్రారంభించాడు. రెండు మూడు సార్లు ప్రయత్నించినా అందలేదు. ఈ ప్రయత్నంలో ఇనుప కడ్డీ పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లపై పడి కరెంట్ సరఫరా అయింది. అంతే షేక్ మతిన్కు కరెంట్ షాక్ కొట్టింది. క్షణాల్లోనే ఆ బాలుడు చెట్టుపైనే కొట్టుమిట్టాడుతూ ఊపిరి వదిలాడు. కుర్నాపల్లి గ్రామానికి చెందిన షేక్ మతిన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.