తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజలింగమూర్తి హత్య కేసు - ఏడుగురి అరెస్ట్, పరారీలో మరో ముగ్గురు - RAJALINGA MURTHY MURDER CASE

రాజలింగమూర్తి హత్య కేసుపై వీడిన సస్పెన్స్ - హత్యకు కారణం భూ తగాదాలే అని తెలిపిన పోలీసులు - ఏడుగురు నిందితుల అరెస్ట్, పరారీలో మరో ముగ్గురు

MEDIGADDA COMPLAINANT MURDERED
Rajalinga Murthy Murder Case Update (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2025, 1:51 PM IST

Rajalinga Murthy Murder Case Update : భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యకు సంబంధించి పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ప్రాజెక్టులో అవినీతి అక్రమాలపై కేసు వేసిన రాజలింగమూర్తి నాలుగు రోజుల క్రితం హత్య కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ హత్య కేసును పోలీసులు సవాల్​గా తీసుకుని ముమ్మర దర్యాప్తు చేశారు. కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు.

ఎకరం భూమి కోసం హత్య :ఇవాళ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎకరం భూమి వివాదమే హత్యకు దారితీసిందని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎకరం భూమికి సంబంధించి ఏ1 నిందితుడైన రేణిగుంట్ల సంజీవ్​కు, రాజలింగమూర్తికి చాలా రోజుల నుంచి గొడవ నడుస్తోందన్నారు. ఇందులో కొంత భాగం తన పేర రాయించుకున్నాడంటూ రాజలింగమూర్తిపై సంజీవ్ కక్ష్య పెంచుకుని హత మార్చాలని నిర్ణయించుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

కళ్లల్లో కారం చల్లి దారుణంగా హత్య :ఇందుకోసం తన బంధువుల సాయం కూడా తీసుకున్నాడని జిల్లా ఎస్పీ తెలిపారు. పక్కా పథకం ప్రకారం ఈ హత్య జరిగిందన్నారు. సంజీవ్ ఇతర నిందితులు వరంగల్ కాశీబుగ్గ ప్రాంతంలో రెండు కత్తులు, ఓ రాడ్ కొనుగోలు చేశారు. ఈ నెల 19న రాత్రి రాజలింగమూర్తిని దారికాచి అడ్డగించి కళ్లల్లో కారం చల్లి దారుణంగా హతమార్చారు. మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ కొత్త హరిబాబు సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. భూ వివాదాలు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని, ఎలాంటి నేరాలకు పాల్పడినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.

మేడిగడ్డ బ్యారేజీ కేసు : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్​ ప్రభుత్వమే కారణమని భూపాలపల్లికి చెందిన మృతుడు రాజలింగమూర్తి (47) అప్పట్లో కేసు వేశారు. రాజలింగమూర్తి భార్య మాజీ కౌన్సిలర్​. ఆమె 2019లో జరిగిన పురపాలక ఎన్నికల్లో భూపాలపల్లిలోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్​ తరఫున కౌన్సిలర్‌గా గెలుపొందారు. కొద్ది నెలల తర్వాత బీఆర్ఎస్​ పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన హత్యకు ఏమైనా రాజకీయ కుట్ర ఉందా అనే చర్చ సైతం జరిగింది. అయితే పోలీసుల విచారణలో భూ తగాదాలతోనే హత్య జరిగినట్లు తేలింది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య - రంగంలోకి సీఎంవో

చుట్టూ జనం ఉన్నారన్న భయమే లేదు - బస్టాప్​లో తండ్రిని పొడిచి చంపిన కుమారుడు

ABOUT THE AUTHOR

...view details