Disposal of Plastic Waste in SCR : దక్షిణ మధ్య రైల్వేకు పారవేసే ప్లాస్టిక్ కాసుల వర్షం కురిపిస్తోంది. పారేసే చెత్త ప్లాస్టిక్‌కు డబ్బులు ఎవరు ఇస్తారులే అనుకుంటున్నారేమో! డబ్బులు చెల్లించి మరీ, ఓ సంస్థ ప్లాస్టిక్‌ను కొనుగోలు చేస్తోంది. రైల్వే ప్రయాణికులు వాడిపడేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసేందుకు రైల్వే అధికారులతో స్క్రాప్ క్యూ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖపట్టణం, శంబల్పూర్ రైల్వే స్టేషన్లలో ఇప్పటికే ఈవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఈ సంస్థ సేకరిస్తోంది.
మూడేళ్లపాటు ఒప్పందం : తాజాగా మరో మూడు రైల్వే స్టేషన్లలో సైతం ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు ఇటీవలే సదరు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. కాచిగూడ, నిజామాబాద్, కర్నూల్ రైల్వే స్టేషన్లలో రైళ్లలో వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను మూడేళ్ల పాటు సేకరించేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా స్క్రాప్ క్యూ సంస్థ ప్రతినిధులు, ప్రతి నిత్యం రైళ్లలో వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు సేకరించి వాటిని తీసుకెళుతుంటారు.
ప్లాస్టిక్ డేటా సేకరణ : స్క్రాప్ క్యూ సంస్థ ట్రాక్ అండ్ ట్రేస్ వ్యవస్థను కలిగి ఉంది. ఒక రైలులో ఒక ప్రయాణికుడు ఏమేరకు ప్లాస్టిక్ వ్యర్థాలను పడేస్తారు. ఒక్కో రైలులో ఎంత మేరకు ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. తదితర వాటిని ఈ వ్యవస్థతో కచ్చితంగా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రతి ప్రయాణికుడు ప్రయాణించే రైలులో కనీసం 40 గ్రాముల నుంచి 50 గ్రాముల ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్‌ను పడేస్తారని ట్రాక్ అండ్ ట్రేస్‌తో తెలుసకున్నట్లు స్క్రాప్ క్యూ సంస్థ వెల్లడించింది.