19 Year Old Dies By Suicide Case In Hyderabad : హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 11న డిగ్రీ విద్యార్థిని స్రవంతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన కేసును పోలీసులు ఛేదించారు. సొంత అన్న భార్య (వదిన) శైలజ వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడిందని నిర్ధారించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం : రసూల్‌పురా ఇందిరమ్మ నగర్‌కు చెందిన విఠల్ కుమార్తె స్రవంతి (19) ఈ నెల 11వ తేదీన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పొరుగున ఉండే ఓ యువకుడి వేధింపులతోనే కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు, స్రవంతి మొబైల్లోని సందేశాల ద్వారా యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌లో ఉంటున్న నవీన్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది.
పెళ్లికి ముందే సంబంధం : స్రవంతి వదిన శైలజకు నవీన్ కుమార్‌తో పెళ్లికి ముందే సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతను ఇటీవల మళ్లీ శైలజను కలవడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని స్రవంతి కనిపెట్టింది. ఈ విషయం ఎక్కడ బయట పడుతుందోనని భావించిన వదిన, స్రవంతికి ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడితో సంబంధం ఉందంటూ వేధించడం ప్రారంభించింది. అతను తనకు సోదరుడి వంటివాడని చెప్పినా, వినిపించుకోకుండా వేధింపులు కొనసాగించింది.
వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య : దీనికి తోడు తనతో సంబంధం ఉన్న నవీన్ కుమార్‌ను రంగంలోకి దించి అతనితో స్రవంతి ఫోన్‌కు మెసేజ్‌లు పంపిస్తుండేది. అన్న భార్య శైలజ, నవీన్ కుమార్‌లు పెట్టే వేధింపులు తట్టుకోలేక స్రవంతి ఆత్మహత్య చేసుకుంది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ చేపడితే అసలు నిజం ఏంటో తెలిసింది. కోడలే తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైనట్లు పోలీసుల విచారణలో బయటపడటంతో స్రవంతి తల్లిదండ్రులు అవాక్కయ్యారు. శైలజతో పాటు నవీన్ కుమార్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.
ప్రేమ పేరుతో కుమార్తెకు వేధింపులు - యువకుడికి పలుమార్లు తండ్రి వార్నింగ్ - ఎంతకీ వినకపోవడంతో?
అందరిముందు అవమానం - ఆ స్టూడెంట్ను కఠినమైన నిర్ణయం తీసుకునేలా చేసింది