Fancy Registration Number For Vehicle : రోజురోజుకూ మార్కెట్లోకి ఎన్నో ప్రత్యేకతలున్న వాహనాలు వస్తుంటాయి. కొందరు తాము మెచ్చిన వాహనాన్ని కొనేందుకు రూ.లక్షలు వెచ్చిస్తుంటారు. అలాంటి వారు రిజిస్ట్రేషన్ నంబరు కూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. చాలా మందికి ఫ్యాన్సీ నంబర్స్ అంటే చాలా మోజు ఉంటుంది. కొంత మందికి నంబర్ సెంటిమెంట్ ఉంటుంది. దీంతో ఎంత ఖర్చు అయినా సరే వేలం ద్వారా ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకోవడానికి వెనకాడరు. వీరి ఉత్సాహంతో రవాణా శాఖకు కాసుల వర్షం కురుస్తోంది.
ఒక్క రోజే ఆర్టీఏకు రూ.5.06 లక్షల ఆదాయం : కరీంనగర్ జిల్లా రవాణా శాఖ గురువారం ఆరు నంబర్లకు రూ.1,35,000 ఫీజు నిర్దేశించి ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించింది. పలువురు పోటీపడి వాటిని దక్కించుకోగా, ఆ శాఖకు రూ.5.06 లక్షల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఎస్ స్థానంలో టీజీని ప్రవేశపెట్టింది. ఆ సిరీస్ వచ్చిన తర్వాత కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయ పరిధిలో ఆన్‌లైన్ వేలం పాటలో టీజీ 02 9999 నంబర్‌కు అత్యధిక ధర పలకడం విశేషం. గురువారం నుంచి టీజీ బి.0001 సిరీస్ ప్రారంభమైంది. దీంతో ఫ్యాన్సీ నంబర్ల కోసం పోటీ పెరిగిందని ఉమ్మడి జిల్లా ఉప రవాణా కమిషనర్ పెద్దింటి పురుషోత్తం తెలిపారు.
ఫ్యాన్సీ నెంబర్‌కు రూ.5 లక్షలు : సినీ నటులు కూడా నచ్చిన కారు కొని వారికి కావాల్సిన ఫ్యాన్సీ నంబర్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. ఇటీవల సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి టయోటా వెల్ ఫైర్ కారు కొనుగోలు చేశారు. దీని విలువ సుమారు రూ.కోటి వరకు ఉంటుంది. అలాగే ఈ కారు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబరు కోసం చిరు రూ.5 లక్షలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
తాజాగా సినీ నటుడు రామ్ చరణ్ కూడా రోల్స్ రాయిస్ కారును కొన్నారు. దీని ధర దాదాపు రూ. 7.5 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ కారు ఫ్యాన్సీ నెంబరు TG 09 2727 కోసం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ రోల్స్ రాయిస్ కారు నెంబర్ తెలుసా?
చిరు గ్యారేజ్‌లో లగ్జరీ కార్లు- ఆ వెహికిల్‌కు స్పెషల్ రిజిస్ట్రేషన్! - Chiranjeevi Car Collection