Sanitizer bottle exploded and three were seriously injured : కరోనా సమయంలో ప్రాణాలు కాపాడుతుందని తెచ్చిన శానిటైజర్ సీసానే ముగ్గురిని తీవ్ర గాయాలపాలు చేసింది. ఇంకా చెప్పాలంటే ప్రాణాపాయ స్థితిలోకి నెట్టివేసింది. శానిటైజర్ల వాడకంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. వీటిని మరీ అతిగా, అనవసరంగా వాడకపోవటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. సబ్బుతో చేతులను కడుక్కునే అవకాశం లేనప్పుడు మాత్రమే శానిటైజర్లను వాడుకోవాలని సూచిస్తున్నారు. ఎంత మంచివైనా క్వాలిటీవైనా కూడా వీటితో కొన్ని దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి ఉందన్న సంగతి మరవరాదు.
పేలిన ఐదు లీటర్ల శానిటైజర్ డబ్బా : నారాయణపేట జిల్లాలోని మద్దూరులో ఓ ఇంట్లో వ్యాలిడిటీ పూర్తయిన శానిటైజర్ సీసా పేలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇల్లును శుభ్రపరచడానికి మంగళవారం(డిసెంబరు 24) నాడు మ్యాతరి భాస్కర్ అనే వ్యక్తి సిద్ధమయ్యారు. చాలాకాలం క్రితం తెచ్చి ఉంచిన శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకునేందుకు ప్రయత్నించారు. కానీ శానిటైజర్ డబ్బా మూత తెరిచే క్రమంలో ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలింది.
శరీర భాగాలపై తీవ్ర గాయాలు : ఆ కెమికల్ వాటర్ అంతా భాస్కర్ శరీరం, ముఖం, తల, చేతులపై పడటంతో మొత్తంగా తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉన్న ఇద్దరికై కూడా ద్రావణం పడటంతో వారికీ అక్కడక్కడా గాయాలయ్యాయి. బాధితులను హుటాహుటిన నారాయణపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భాస్కర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని మద్దూరు సబ్ ఇన్స్పెక్టర్ రాంలాల్ తెలిపారు.