Sanghamitra Animal Foundation by 7 Youngsters of Vijayawada to Serve Animals : ప్రస్తుత తరుణంలో సాటి మనుషులే పట్టించుకోని రోజులివి. అలాంటిది గాయపడిన వీధిశునకాలను తెచ్చి చికిత్స అందించి మళ్లీ తేరుకునేలా చేయడం సామాన్య విషయం కాదు. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లిలోని "సంఘమిత్ర యానిమల్ ఫౌండేషన్ సంస్థ" ఆ దిశగా సేవలందిస్తోంది. అందరి ప్రశంసలు పొందుతోంది. ఏడుగురు యువకులు పూర్తి సేవాభావంతో ఈ సంస్థను నిర్వహిస్తూ మూగజీవాలకు అండగా నిలుస్తున్నారు.
వాళ్లందరూ ఉన్నత చదువులు పూర్తి చేసిన యువకులు. బాధ్యత తెలిసిన మంచి మనసున్న మనుషులు. మూగజీవాలకు పట్ల ప్రేమతో ఒక్కటయ్యారు. "సంఘమిత్ర యూనిమల్ ఫౌండేషన్"ను ఏర్పాటు చేసి వేలాది జంతువుల్ని సంరక్షిస్తూ అందరి మన్నలు పొందుతున్నారు.
అందరూ విజయవాడలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శివారు కొత్తూరు తాడేపల్లి గ్రామంలో 75 సెంట్ల భూమి అద్దెకు తీసుకుని ఎన్జీవో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో 110 శునకాలు వైద్యచికిత్సలు పొందుతున్నాయి.
'మనుషులకు ప్రమాదం జరిగితే చెప్పుకునే అవకాశం ఉంది. మూగజీవాలకు ఏదైనా జరిగితే ఎవరికి చెప్పుకుంటాయి.అందుకే ఉద్యోగం సైతం వదిలేసి మూగజీవాల సేవలో ఆనందంగా గడుపుతున్నాను.గాయపడిన కుక్కల్ని సంరక్షించడం ఆషామాషీ కాదు. ఇందుకు ఎంతో వ్యయ, ప్రయాసల కోర్చి శ్రమించాలి. దాతలు ఇచ్చిన విరాళాలతోనే సంస్థ నడుపుతున్నాం. కుక్కలకు ఆహారం, మందులు, సిబ్బంది జీతాలు, శస్త్రచికిత్సలకు నెలకు 7 లక్షల వరకు ఖర్చవుతోంది.'-రవికీర్తి, సంఘమిత్ర యానిమల్ ఫౌండేషన్ సభ్యుడు