Tomato Ketchup Cleaning Tips : సమోసా, పిజ్జా, పఫ్స్, ఫ్రైంచ్ ఫ్రైస్ ఇలా ఈవెనింగ్ టైమ్‌లో ఏ స్నాక్ తిన్నా టొమాటో కెచప్ ఉండాల్సిందే! కొన్ని రకాల వంటకాల రుచిని పెంచడానికి టొమాటో కెచప్‌ని ఉపయోగిస్తుంటాం. అయితే ఇదే టొమాటో కెచప్ కొన్ని వస్తువులను క్లీన్ చేస్తుందనే విషయం మీకు తెలుసా? ఎందుకంటే టమాటాల్లో సహజసిద్ధమైన ఆమ్ల గుణాలుంటాయి. టమాటాలను కెచప్‌లా తయారుచేసినప్పుడు అవి ఇంకాస్త అధికమవుతాయి. దీనికి కారణం అందులో వెనిగర్ కలవడమే. కాబట్టి దీన్ని ఆహారంగానే కాదు కొన్ని రకాల లోహపు వస్తువులను క్లీన్ చేయడానికీ వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
గిన్నె మాడిపోతే :
వంట చేసే టైమ్‌లో అనుకోకుండా కొన్ని సందర్భాల్లో పాత్ర మాడిపోతుంటుంది. అయితే దాన్ని క్లీన్ చేసే క్రమంలో బలంగా రుద్దాల్సి వస్తుంది. ఇలా గట్టిగా రుద్దితే పాత్ర నాణ్యత దెబ్బతింటుంది. అలా కాకుండా టొమాటో కెచప్‌ను ఉపయోగించి మాడిపోయిన గిన్నెను చాలా ఈజీగా శుభ్రం చేయవచ్చు. ఇందుకోసం కొద్దిగా కెచప్‌ను గిన్నెలో వేసి సన్నని సెగపై వేడి చేయాలి. ఇలా చేసేటప్పుడు కెచప్‌లోని నీరు పూర్తిగా ఆవిరి కాకుండా చూసుకోవాలి. కెచప్ చిక్కగా తయారైన తర్వాత కొద్దిగా వాటర్ కలపాలి. ఇప్పుడు గిన్నెను పొయ్యి మీద నుంచి దింపి రాత్రంతా పక్కన పెట్టి ఉంచాలి. కెచప్‌లోని ఆమ్ల గుణాలు గిన్నెలో మాడిపోయిన భాగాన్ని తొలగిస్తాయి. ఉదయాన్నే పాత్రను డిష్‌వాష్‌తో క్లీన్ చేస్తే సరిపోతుంది.
రాగి వస్తువుల కోసం :
చూడ్డానికి అందంగా ఆకర్షణీయంగా ఉండే రాగి వస్తువులు ఇంటికి కొత్త కళను తీసుకొస్తాయి. అయితే వీటిని క్లీన్ చేయడానికి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే రాగి వస్తువులు మెరిసే గుణాన్ని కోల్పోతాయి. అలాగని శుభ్రం చేయకుండా వదిలేస్తే రంగు మారిపోయి నల్లగా కనిపిస్తాయి. కాబట్టి ఇలాంటి వస్తువుల్ని తళతళా మెరిపించాలంటే టొమాటో కెచప్ ఉపయోగించవచ్చు. దీనికోసం టొమాటో కెచప్‌ను రాగి వస్తువుపై పల్చని పొరలా అప్లై చేయాలి. ఆపై 15 నుంచి 20 నిమిషాల వరకు అలాగే ఉంచి అనంతరం మెత్తని నూలు వస్త్రంతో తుడిచి గోరువెచ్చటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఒకవేళ వస్తువుపై ఎక్కడైనా మచ్చలాగా ఉంటే అక్కడ మరోసారి కెచప్ పూసి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది.
ఫ్రీజర్‌లో ఐస్ ఎక్కువగా పేరుకుపోతుందా? - ఈ టిప్స్ పాటిస్తే అస్సలు గడ్డకట్టదట!
ఇత్తడి పాత్రలు కూడా :
దాదాపు మనందరి ఇళ్లలో ఇత్తడి వస్తువులు కచ్చితంగా ఉంటాయి. వీటిని క్లీన్ చేసే విషయంలోనూ కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వాటర్‌ని నిల్వ ఉంచే ఇత్తడి పాత్రల లోపలి భాగంలో పచ్చగా తయారవుతూ ఉంటుంది. అయితే ఇలాంటి మరకలను టొమాటో కెచప్‌తో చాలా ఈజీగా శుభ్రం చేయవచ్చు. టొమాటో కెచప్‌ను ఇత్తడి వస్తువులకు రాసి కొద్దిసేపటి తర్వాత మెత్తని వస్త్రంతో రుద్దుతున్నట్లుగా తుడవాలి. అనంతరం నీటితో కడిగేస్తే ఇత్తడి వస్తువు కొత్త దానిలా తళతళలాడిపోతుంది. ఒకవేళ చిన్నచిన్న ఇత్తడి వస్తువులను క్లీన్ చేయాల్సి ఉంటే వాటిని కెచప్ నింపిన బౌల్లో వేయాలి. ఆపై కాసేపయ్యాక మెత్తటి వస్త్రంతో తుడిచి కడిగేస్తే సరిపోతుంది.
తుప్పు పట్టకుండా :
ఇనుప వస్తువుల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అవి తుప్పు పడుతుంటాయి. అందుకే వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం మంచిది. ఈ క్రమంలో టొమాటో కెచప్ బాగా పనిచేస్తుంది. ఇందుకోసం వాషింగ్‌సోడాను వాటర్‌లో కలిపి దాన్ని ఇనుప వస్తువుపై స్ప్రే చేయాలి. అనంతరం దానిపై కెచప్ పూసి కాసేపాగిన తర్వాత రుద్ది కడిగేస్తే సరిపోతుంది. తరచూ ఉపయోగించే గార్డెనింగ్ టూల్స్ విషయంలోనూ ఇదే టిప్ పాటిస్తే అవి తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం మన్నుతాయి.
వెండి ఆభరణాలు కొత్తవాటిలా :
సాధారణంగా వెండి వస్తువులు, ఆభరణాలు కొంత కాలం తర్వాత రంగు మారిపోయి నల్లగా తయారవుతాయి. తిరిగి వాటిని మెరిపించడానికి టొమాటో కెచప్ ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక గిన్నెలో టొమాటో కెచప్‌ను పోసి దానిలో వెండి వస్తువుని ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉంచాలి. అనంతరం మృదువైన బ్రిజిల్స్ ఉన్న టూత్‌బ్రష్‌తో రుద్ది, పొడి వస్త్రంతో తుడవాలి. ఇప్పుడు గోరువెచ్చటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. అయితే ఏ వెండి వస్తువునైనా టొమాటో కెచప్‌లో పది నిమిషాలకు మించి ఎక్కువ సమయం ఉంచకూడదన్న విషయం గుర్తుంచుకోవాలని నిపుణులు తెలిపారు.
పట్టు చీరలను ఇలా ఉతికి, బీరువాలో పెడితే - ఎన్ని రోజులైనా కొత్తవాటిలా మెరుస్తూ ఉంటాయి!