Vikranth Reddy conspiracy Case Hearing in High Court : కేవీఆర్ గ్రూప్ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి కాకినాడ సీపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (KSPL), కాకినాడ సెజ్ లిమిటెడ్ (KSEZ)లోని వాటాలు అరబిందో సంస్థకు కట్టబెట్టిన వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ పెద్దలతో కలిసి వై. విక్రాంత్‌రెడ్డి కుట్ర పన్నారని సీఐడీ తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు. పీకేఎఫ్ శ్రీధర్ ఆడిట్ సంస్థ తప్పుడు నివేదిక ఇచ్చిందని, ఈ నివేదికను ఆసరాగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి రూ.965 కోట్లు ఎగవేశారంటూ కేవీ రావును బెదిరించారని పేర్కొన్నారు.
వాటాల బదలాయింపునకు ఒప్పుకోకపోతే కేవీరావు, ఆయన కుటుంబీకులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బెదిరించారని వివరించారు. వాటాల బలవంతపు బదలాయింపు నాటికి కేఎస్‌పీఎల్ లాభాల్లో నడుస్తోందని తెలిపారు. రూ.2600 కోట్ల విలువ చేసే 41 శాతం పోర్టులో వాటాను రూ.480 కోట్లకు దక్కించుకున్నారని తెలిపారు. కేఎస్‌పీఎల్ రూ.965 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందని 2020 మార్చిలో పీకేఎఫ్ సంస్థ మొదటిసారి తప్పుడు నివేదిక ఇచ్చిందని ఏజీ వివరించారు. అరబిందో రియాల్టీ ఇన్‌ఫ్రాకు షేర్ల బదిలీ తర్వాత కేవలం రూ.9 కోట్లే చెల్లించాల్సి ఉందని రెండోసారి పీకేఎఫ్ సంస్థ నివేదించిందని పేర్కొన్నారు.
వాటాల బదలాయింపునకు కేవీ రావును విక్రాంత్‌రెడ్డి బెదిరించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని, ఆయనకు ముందస్తు బెయిలు ఇస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందని, పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. ఫిర్యాదుదారు కేవీ రావు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వాటాల బదిలీ కోసం డాటెడ్ లైన్లు ఉన్న దస్త్రంపై కేవీ రావు సంతకాలను బలవంతంగా తీసుకున్నారన్నారు. కాకినాడ సెజ్ లిమిటెడ్‌కు ఉన్న అప్పులను పరిగణనలోకి తీసుకున్న తరువాతే కేవీ రావు వాటాను రూ.400 కోట్లకు కొనేందుకు జీఎం23573008 ఆర్ సంస్థ ఒప్పందం చేసుకుందని, కాని కేవలం రూ.12 కోట్లు చెల్లించి సెజ్‌లోని కేవీ రావు వాటాలను అరబిందో దక్కించుకుందని తెలిపారు.
కాకినాడ పోర్టు వివాదంలో భారీ ట్విస్ట్ - కేవీ రావు చేతికి వాటాలు రిటర్న్స్
మాజీ ఏజీ, సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి సలహా మేరకే : విక్రాంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, మాజీ ఏజీ న్యాయ సలహా తీసుకున్నాకే ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము రూ.965 కోట్లను రూ.తొమ్మిది కోట్లుగా కుదిస్తూ ఆడిట్ సంస్థ ఇచ్చిన నివేదికకు ప్రభుత్వం ఆమోదించిందని వివరించారు. రాజకీయ ప్రతీకారంతో పిటిషనర్‌పై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు.
జగన్ మరో దాష్టీకం వెలుగులోకి - రాక్షస రాజకీయంతో కాకినాడ పోర్టు అరబిందో పరం!