Sand Dunes in Annaram Barrage :అన్నారం బ్యారేజీని ఇసుక సమస్య వెంటాడుతోంది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచన మేరకు బ్యారేజీ వద్ద, గేట్లు కింద మేట వేసిన ఇసుకను తొలగించి రెండు నెలలు కాకముందే మళ్లీ 3 నుంచి 4 మీటర్ల మేర ఇసుక పేరుకుపోవడంతో నీటిపారుదల శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. తగిన ఇన్వెస్టిగేషన్ లేదా ఎలైన్మెంట్ లేకపోవడంతో ఈ పరిస్థితి వస్తుండవచ్చని డిజైన్ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజీలోని 4,5,6 బ్లాకుల్లో 18గేట్ల వద్ద ప్రస్తుతం ఇసుక మేటలు వేసినట్లు సమాచారం
బ్యారేజీ ఎలివేషన్ మీన్ సీ లెవల్‌కు 106 మీటర్ల ఎత్తులో ఉండాలి. కానీ ప్రస్తుతం కొన్నిచోట్ల 110 నుంచి 111 మీటర్లకు పెరిగినట్లు సమాచారం. వాస్తవానికి అన్నారం వద్ద నది ఒకవైపు ఎంఎస్‌ఎల్‌కు 103 నుంచి 104 మీటర్ల ఎత్తులో ఉంటే, ఇంకో వైపు 111 నుంచి 112 మీటర్ల వరకు ఉంది. దీన్ని ఒక లెవల్‌కు తెచ్చి 106 మీటర్ల వరకు క్రస్ట్ నిర్మించి, పైన గేట్లను అమర్చారు. అయితే వరదలు వచ్చినపుడు నది తన పూర్వస్థితికి చేరుతున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి.
ఇటీవలే తొలగించిన దానికంటే ఎక్కువగా ఇసుక మేటలు :4, 5, 6 బ్లాకుల్లో 18 గేట్ల వద్ద 4 మీటర్ల వరకు ఇసుక మేట వేయగా అక్కడ 110 నుంచి 111 మీటర్ల నీటిమట్టం ఉన్నట్లు తెలిసింది. అంటే క్రస్ట్‌పైనా నాలుగైదు మీటర్ల మేర ఇసుక ఉన్నట్లు. రాఫ్ట్ ఎంఎస్‌ఎల్‌కు 106 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీనిపైనా 3 నుంచి 4 మీటర్ల మేర ఇసుక మేటలు ఏర్పడ్డాయి. లాంచింగ్ ఆఫ్రాన్ 104.5, స్టిల్లింగ్ బేసిన్ 103.5 మీటర్ల ఎత్తులో ఉంది. అక్కడ ఆరేడు మీటర్ల మేర ఇసుక చేరినట్లు సమాచారం.
కాళేశ్వరంలో కీలక పరిణామం - అన్నారంలో నీటినిలుపుదలకు పూర్తయిన మరమ్మతులు - Arrangements to store water in Annaram barrage
గతంలో లేని విధంగా బ్యారేజీ దిగువ భాగంలోనూ వచ్చినట్లు తెలుస్తోం. ఇటీవలే తొలగించిన దానికంటే ఎక్కువగా ఇసుక మేటలు వచ్చి చేరినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం బ్యారేజీకీ వరద ప్రవాహం తగ్గగా, ఇప్పుడు మళ్లీ పెరిగింది. వర్షాకాలం పూర్తయ్యేలోగా ఇసుక మేట మరింత ఎక్కువయ్యే అవకాశముంది. అదే జరిగితే నీటిని నిల్వ చేయాలంటే గేట్లు పూర్తిగా దిగవు.
ఇసుక మేటతో నీటి ప్రవాహంలోనూ మార్పులు జరిగి బ్యారేజీపై ప్రభావం చూపే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఏ ప్రాజెక్టు అయినా నీటి ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకొనే బ్యారేజీని డిజైన్ చేస్తారు. నాలుగైదు మీటర్ల మేర ఇసుక ఉంటే డిజైన్‌కు భిన్నంగా ప్రవాహంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రవాహం పూర్తిగా తగ్గితేనే నీటి నిల్వకు అవకాశం : ఇసుక మేటలు ఏర్పడిన విషయంపై నీటిపారుదల శాఖ వర్గాలను సంప్రదించగా గేట్లను తెరిచి ఉంచడంతోనే ఈ సమస్య వచ్చిందని వాటిని మూసే ముందు ఇసుకను తొలగిస్తామని చెబుతున్నారు. అయితే వరద ప్రవాహం పూర్తిగా తగ్గితేనే గేట్లు మూసి, నీటిని నిల్వ చేసే అవకాశముంటుంది. విచారణ అన్నీ పూర్తయి బ్యారేజీ సీపేజీకి గల కారణాలు తేలే వరకు నీటిని నిల్వ చేయొద్దని, గేట్లు పూర్తిగా తెరిచి ఉంచాలని ఎన్‌డీఎస్‌ఏ సూచించింది. ఎన్‌డీఎస్‌ఏ సూచించిన పరీక్షలు చేయించడానికి వీలుగా కొంత భాగంలో ఇసుక తొలగించగా, ఇప్పుడు మళ్లీ రెండు నెలల్లోనే 3-4 మీటర్ల మేర ఇసుక మేట వేయడంతో చర్చనీయాంశంగా మారింది.
కాళేశ్వరానికి భారీ వరద - మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లు ఎత్తి నీటి విడుదల - Heavy Flood Flow To Kaleshwaram
కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీలో నీటి పరీక్షలు