6 Crore Money Seize in Karimnagar :ఎన్నికల కోడ్ రాకముందే కరీంనగర్‌లో భారీ మొత్తం నగదు పట్టుబడింది. నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో లెక్కచూపని రూ. 6.65 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. హోటల్, బార్ అండ్ రెస్టారెంట్, సినిమా హాళ్లలో బలగాలు విస్తృతంగా సోదాలు జరిపాయి. అర్థరాత్రి ఒకటిన్నర సమయంలో ప్రారంభమైన తనిఖీలు ఉదయం వరకు కొనసాగాయి. తమకు అందిన కీలక సమాచారం మేరకే ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. స్వాధీనం చేసుకున్న డబ్బును కోర్టులో డిపాజిట్ చేయనున్నట్లు కరీంనగర్ ఏసీపీ నరేందర్ తెలిపారు. కాగా ప్రతిమ హోటల్స్‌కు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్‌కు సంబంధాలు ఉన్నాయి. పార్టీ కార్యకలాపాలు, రాజకీయ సమీకరణాలు ఇక్కడి నుంచే మంత్రాంగం నెరిపేందుకు వినోద్ కుమార్ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసుల దాడుల విషయం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.