Robberys In Hyderabad Vijayawada Highway :జాతీయ రహదారిపై రాత్రి సమయాల్లో దారి దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి వేళల్లో ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా అచ్చం ప్రయాణికుల్లాగే తిరుగుతూ పార్కింగ్ చేసిన వాహనదారులను బెదిరించడం వారి వద్ద నుంచి డబ్బు, బంగారం లాక్కోవడం చేస్తున్నారు. మరొక ముఠా సభ్యులు రహదారి పక్కన శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇళ్లలోకి ప్రవేశించి చోరీలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో విలువైన వస్తువులు దొంగలిస్తున్నారు. దొంగతనాలపై దృష్టి సారించిన నల్గొండ జిల్లా పోలీసులు దారి దోపిడీలపై నిఘా పెంచారు.
జాతీయ రహదారిపై దారి దోపిడీలు, దొంగతనాలను ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఇద్దరు పార్థీ ముఠా సభ్యులను అరెస్టు చేశారు. రాత్రి పూట జాతీయ రహదారిపైన పెట్రోలింగ్ పెంచిన పోలీసులు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల కోసం ఉపయోగించే బ్యాటరీలను చోరీ చేస్తున్న నలుగురు దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 7.18 లక్షల విలువైన 100 బ్యాటరీలు, ఒక ట్రాలీ ఆటో, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఎయిర్‌టెల్ సెల్‌ఫోన్ టవర్లే లక్ష్యం : నిర్మానుష్య ప్రదేశాల్లో ఉన్న ఎయిర్‌టెల్ సెల్‌ఫోన్ టవర్లను లక్ష్యంగా చేసుకుని అందులోని 5జీ రేడియో రిమోట్ యూనిట్లను అపహరిస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైతం పోలీసులు అరెస్టు చేశారు. దొంగిలించిన వాటిని నిందితులు హైదరాబాద్‌లో అమ్ముతున్నారు. నిందితుల దగ్గర నుంచి రూ.1.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివరాం తెలిపారు. జాతీయ రహదారిపై దారి దోపిడీలు, దొంగతనాల నియంత్రణకు నల్గొండ జిల్లా పోలీసులు నిఘా పెంచి పెట్రోలింగ్ ముమ్మరం చేశారు.