Seven Died in Road Accident in East Godavari District :ఏపీలోనిఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారి రక్తసిక్తమైంది.తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు కార్మికులు మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఏలూరు జిల్లా టి. నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి జీడిపిక్కల లోడుతో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లకు మినీ లారీ వెళుతోంది. ఆరిపాటిదిబ్బలు- చిన్నాయిగూడెం రహదారిలోని చిలకావారిపాకలు సమీపంలో అదుపుతప్పి పంట బోదెలోకి లారీ దూసుకెళ్లి తిరగబడింది.
వాహనంపై 9 మంది కార్మికులు ప్రయాణిస్తున్నారు. లారీ తిరగబడడంతో జీడిపిక్కల బస్తాలు కార్మికులపై పడి ఏడుగురు చనిపోయారు. మృతులు సమిశ్రగూడెం మండలం తాడిమళ్లకు చెందిన దేవాబత్తుల బూరయ్య (40), తమ్మిరెడ్డి సత్యనారాయణ (45), పి.చినముసలయ్య (35), కత్తవ కృష్ణ (40), కత్తవ సత్తిపండు (40), తాడి కృష్ణ (45), నిడదవోలు మండలం కాటకోటేశ్వరానికి చెందిన బొక్కా ప్రసాద్‌గా పోలీసులు వెల్లడించారు. స్థానికులు సకాలంలో స్పందించి పోలీసులకు సమాచారాన్ని అందించారు.