Recent Suicides in Hyderabad : కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, ప్రేమ.. ఇలా కారణమేదైనా కొందరు ఆత్మహత్యే ఫలితమని భావిస్తున్నారు. నగరంలో కొన్ని రోజులుగా వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. బలవన్మరణాలకు ఎక్కువగా ఆర్థిక సమస్యలు, ఒత్తిడి భరించలేకపోవడం కారణంగా ఉన్నాయి. తాజాగా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో నష్టపోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీన్ని భరించలేక అతని తల్లి ఆత్మహత్యకు యత్నించారు. నార్సింగి ఠాణా పరిధిలో ఓ మహిళ మూడేళ్ల కూతురితో 18వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.
ప్రధాన కారణాలు : యుక్త వయసులో పలువురు ఒత్తిడి తట్టుకోలేకపోవడం, ఆర్థిక సమస్యల వలయంలో సతమతమవుతున్నారు. సమస్య చిన్నదే అయినా కొందరు తీవ్రంగా ఆలోచిస్తుంటారు. ఆత్మహత్యలకు ప్రధానంగా మూడు కారణాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. వ్యక్తిగత నేపథ్యంతో పాటు మానసిక, సామాజిక పరిస్థితులు ఒక వ్యక్తిపై విపరీత ప్రభావం చూపిస్తాయి. వృత్తిపరమైన ఒత్తిడి, ఆర్థిక పరిస్థితులు, జీవితంలో జరిగే కొన్ని ఘటనలు, సొంతమని భావించే వ్యక్తుల అకాల మరణంతో ఒక్కసారిగా మనోవేదన ప్రారంభమవుతుంది. మరణం తప్ప మరోదారి లేదనే భావనతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
- నగరంలో 10 రోజుల్లో ఏకంగా 20 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు.
- రోడ్డు ప్రమాదాల్లో 15-29 ఏళ్ల మధ్య వయసున్న యువత ఎక్కువగా మరణిస్తుండగా.. రెండో స్థానంలో ఆత్మహత్యలుండడం కలవరపెడుతోంది.
కొత్త ప్రవర్తన : బాధితుల ప్రవర్తన గుర్తిస్తే ఆత్యహత్యల్లో 90 శాతం నివారించొచ్చని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు వారు పలు సూచనలు చేస్తున్నారు. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు సహచరులు, కుటుంబసభ్యులతో ప్రవర్తన కొత్తగా ఉంటుంది.
- ఒంటరిగా ఉంటారు. ఇతర ప్రాంతాలు, వేడుకలు, కార్యక్రమాలకు వెళ్లేందుకు ఇష్టపడరు.
- కొందరు తాము జీవించి లాభం లేదంటూ రోజూ బాధపడుతుంటారు.
- కుటుంబ సభ్యులకు భారంగా మారామని ఆవేదనతో ఇష్టమైన పనులు చేయలేరు.
- స్నేహితులు, కుటుంబానికి దూరంగా ఉంటారు. ఖరీదైన వస్తువులను దానం చేస్తుంటారు.
- ఏదైనా పని చెప్తే నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు. దేన్నీ సీరియస్గా పరిగణించరు. డ్రగ్స్, మద్యం విపరీతంగా తీసుకోవడం ఒక లక్షణం.
- నిరాశలో ఉంటూ ఎప్పుడు చిరాకు పడుతుంటారు. సందేహం అనిపిస్తే వెంటనే వైద్యులకు చూపించాలి.