GHMC Expansion to Outer Ring Road : ప్రధాన నగరం, శివారు ప్రాంతం అనే వ్యత్యాసం కనిపించకుండా రాజధానిని ఓఆర్‌ఆర్ వరకూ విస్తరించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్ అనే హద్దులను తొలగించేందుకు చర్యలకు ఉపక్రిస్తుంది. రింగు రోడ్డు లోపల ఉన్నదంతా హైదరాబాద్ మహానగరమే అనేలా చేయనుంది. అక్కడి వరకు బృహత్తర ప్రణాళికను రూపొందించి, రోడ్లు, తాగునీరు, మురుగునీటి వ్యవస్థను ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తుంది. అందుకోసం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అధికార యంత్రాంగం ప్రాథమిక ప్రణాళికను సిద్ధం చేశారు. 2026 నాటికి విశాల నగరాన్ని ఆవిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు.
నగరాన్ని ఎలా విస్తరిస్తారంటే: జీహెచ్‌ఎంసీ ప్రస్తుత విస్తీర్ణం 650చ.కి.మీ. జీహెచ్‌ఎంసీని ఓఆర్‌ఆర్ వరకు విస్తరిస్తే 2200చ.కి.మీ అవుతుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 27 మున్సిపాలిటీలతో పాటుగా నగరపాలక సంస్థలు, 33 గ్రామ పంచాయతీలు, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పరిపాలన సాగుతోంది. ఇన్ని రకాల పాలనలు ఉండటం వల్ల సమన్వయం లోపించి, నగరాభివృద్ధి ప్రణాళికాబద్ధంగా జరగట్లేదని ప్రభుత్వం అభిప్రాయ పడుతుంది. ఓఆర్‌ఆర్ హద్దుగా ఒకే నగరానికి శ్రీకారం చుట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే అధికారం చేపట్టిన మొదటి వారంలోనే పురపాలకశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హెచ్‌ఎండీఏ, జలమండలి, మూసీ నది అభివృద్ధి సంస్థ, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు అందుకు సంబంధించి ప్రణాళికను ఓ కొలిక్కి తెచ్చారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా నిపుణులతో మరోమారు క్షేత్రస్థాయి పరిశీలన చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం.