Changes In Minor Passport Applications :మైనర్ పాస్‌పోర్టుల జారీ ప్రక్రియకు సంబంధించి సమర్పించే ధ్రువపత్రాల్లో విదేశీ వ్యవహారాలశాఖ తాజాగా స్వల్ప మార్పులు చేసింది. ప్రధానంగా విడాకుల కేసులు పెండింగ్‌లో ఉన్నవారు, విడిపోయిన జంటల పిల్లలు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేస్తే ఏయే పత్రాలు సమర్పించాలనే విషయంపై స్పష్టత ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 5 పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పోస్టాఫీసు కేంద్రాల ద్వారా రోజూ 4వేల పాస్‌పోర్టులు మంజూరవుతున్నాయి. ఇందులో 5శాతం వరకూ మైనర్ పాస్‌పోర్టు దరఖాస్తులు ఉంటున్నాయి. విడాకులు, మైనర్ల కస్టడీ తదితర అంశాలు విచారణలో ఉంటే సాధారణ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారు తత్కాల్‌లో చేయకూడదు.
- దంపతుల మధ్య వివాదాలు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉంటే తమ పిల్లల పాస్‌పోర్టు దరఖాస్తు చేయడానికి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఒప్పుకొనకపోతే అనెక్జర్- సిలో పేర్కొన్న పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది అంగీకరించకపోవడానికి గల కారణాలను వివరిస్తే పాస్‌పోర్టు అధికారులు తమ విచక్షణాధికారాన్ని ఉపయోగించి పాస్‌పోర్టు జారీ చేసేందుకు అవకాశం ఉంది.
- తల్లి లేదా తండ్రి విదేశాల్లో ఉండి అనుమతి ఇచ్చే పరిస్థితుల్లో లేకపోతే పాస్‌పోర్టు కాపీ, విదేశాలకు వెళ్లినట్టు, అక్కడే ఉంటున్నట్టు ఆధారాలివ్వాల్సి ఉంటుంది. లాంగ్‌టర్మ్ లేదా రెసిడెంట్ వీసా, ఇమ్మిగ్రేషన్ స్టాంప్ కాపీలను అందించాలి.
- న్యాయస్థానం విడాకులు మంజూరు చేసి కస్టడీని తల్లి లేదా తండ్రికి అప్పగించి పిల్లలను కలుసుకునే అవకాశం ఇవ్వకపోతే కోర్టు తీర్పు కాపీ లేదా డిక్రీని అందించాలి. పిల్లలను కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తే ఇద్దరి అనుమతి తప్పనిసరి. అయినప్పటికీ అనుమతి ఇచ్చేందుకు ఇద్దరిలో ఒకరు అంగీకరించకపోతే, 15 రోజుల సమయం ఇచ్చి విచక్షణాధికారం ప్రకారం అధికారులు పాస్‌పోర్టు మంజూరు చేస్తారు.
- విడాకులు, కస్టడీ అంశం పెండింగ్‌లో ఉంటే కోర్టులో వేసిన పిటిషన్ కాపీని అందించాల్సి ఉంటుంది. బిడ్డ పుట్టే సమయానికి తల్లి లేదా తండ్రి వదిలేస్తే పాస్‌పోర్టు ఇష్యూయింగ్ అథారిటీ(పీఐఏ) అధికారులు పేర్కొన్న డాక్యుమెంట్లను సమర్పించాలి.
మరిన్ని వివరాల కోసంhttps://www.passportindia.gov.in/వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్ అడ్వైజర్ విభాగాన్ని పరిశీలించొచ్చని ఆర్పీవో( ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి) స్నేహజ పేర్కొన్నారు.